
గుప్తనిధుల తవ్వకాల కేసులో ఆరుగురికి సంకెళ్లు
● పరారీలో మరో నలుగురు
● నిందితుల వివరాలు వెల్లడించిన పోలీసులు
హనుమంతునిపాడు: వివిధ ఆలయాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన కేసులో ఆరుగురు నిందితులకు పోలీసులు శుక్రవారం సంకెళ్లు వేసి వారిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ కథనం ప్రకారం..హనుమంతునిపాడు మండలం నందనవనం పంచాయతీ వెలుగొండపై మల్లప్పచల శివాలయం, రంగనాయకులు స్వామి గుడిలో గుప్తు నిధుల కోసం కొందరు తవ్వకాలు జరిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు అప్రమత్తమై కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు. కనిగిరిలో వైఎస్సార్ విగ్రహం సమీపంలో నిందితులు ఉన్నట్లు గమనించి హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు తన సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు. నిందితుల్లో గిద్దా ఏడుకొండలు, కండె మధుబాబు, సుంకిశాల రీగన్, పాలపర్తి రాజు, షేక్ పచ్చావలి, ఏముల ఏడుకొండలు ఉన్నారు. ఇదే కేసులో మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ విశ్వాసం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీతో పాటు సీఐ షేక్ ఖాజావలి, ఎస్సై మాధవరావు ఉన్నారు.
తర్లుపాడు: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి మండలంలోని కలుజువ్వలపాడు పీఎం శ్రీజవహర్ నవోదయలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పొరపాట్లను సరిచేసుకునేందుకు శనివారం చివరి అవకాశమని ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నమోదులో ఏమైనా పొరపాట్లు ఉంటే సవరించుకోవాలని చెప్పారు. ఆరో తరగతిలో ప్రవేశానికి పశ్చిమ ప్రకాశంలోని 27 మండలాల నుంచి 7,114 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో 3,539 మంది బాలురు కాగా 3,574 మంది బాలికలు ఉన్నట్లు చెప్పారు. శుక్రవారం క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మార్కాపురం డిగ్రీ కళాశాల రిటైర్డు ప్రిన్సిపాల్ నాసరయ్య హాజరై విద్యార్థులకు హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ జీవిత చరిత్ర గురించి వివరించారు. విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి తగ్గిపోతుందని, చదువులో రాణించాలంటే విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నాసరయ్యను నవోదయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బేస్తవారిపేట: భార్య మద్యానికి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన బేస్తవారిపేటలో శుక్రవారం జరిగింది. స్థానిక బీసీ కాలనీలో బూతపాటి జగన్ (30) కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన జగన్ మద్యం తాగేందుకు భార్య దానమ్మను గురువారం రాత్రి డబ్బులు అడిగాడు. డబ్బులు లేవని భార్య చెప్పడంతో ఇంట్లో ఉన్న సూపర్ వాస్మల్ (తలకు వేసే రంగు)తాగాడు. పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై ఎస్‌వీ రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుప్తనిధుల తవ్వకాల కేసులో ఆరుగురికి సంకెళ్లు