
మాతా శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం
ఒంగోలు టౌన్: గర్భిణుల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిల్కారీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు చెప్పారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఆశా నోడల్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాతా శిశు మరణాలను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిల్కారి సేవలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. గర్భిణిగా నిర్ధారణ అయిన 4వ నెల నుంచి బిడ్డ పుట్టి ఏడాది వయసు వచ్చే వరకు కిల్కారి కాల్స్ వస్తుంటాయని వివరించారు. వారానికి ఒకసారి వచ్చే ఈ కాల్ నిడివి కేవలం 2 నిముషాలు ఉంటుందని, రెండు నిముషాలను కేటాయిస్తే జీవితాంతం ఉపయోగపడే సమాచారం లభిస్తుందని చెప్పారు. కిల్కారీ కాల్ వచ్చినప్పుడు గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా వినాలని సూచించారు. కిల్కారి కాల్ కోసం తమ మొబైల్ ఫోన్లలో 911600103660 నంబర్‌ను సేవ్ చేసుకోవాలని చెప్పారు. ఒకవేళ కాల్ మిస్సయితే 14423 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి వినవచ్చన్నారు. అనంతరం జులై మాసంలో కిల్కారి రిసీవర్స్ పెంచిన ఆశా వర్కర్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎం రాజేశ్వరి, కిల్కారి రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ బి.రాజు పాల్గొన్నారు.