ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ శుక్రవారం రాత్రి ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఒంగోలు రూరల్ మండల పరిధిలో చెరువుకొమ్ముపాలెం శ్రీ సరస్వతి విద్యాసంస్థలకు చెందిన భవన సముదాయంలో చేపట్టిన ఈ వెరిఫికేషన్ చిన్నపాటి సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ ప్రశాంతం గా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాకు మంజూరు చేసిన 629 పోస్టులకు తోడు 29 జోనల్ స్థాయి పోస్టులకు సంబంధించి 1:1 దామాషాలో ఈ ప్రక్రియ చేపట్టారు. మేరకు 13 గదులకు ఒక ఎంఈఓ, హెచ్‌ఎం, డిప్యూటీ తహసీల్దార్, సాంకేతిక సిబ్బందిని 13 టీంలుగా ఏర్పాటు చేసి వెరిఫికేషన్ పూర్తి చేశారు. మొత్తం 658 మంది అభ్యర్థులకు గాను 651 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశారు. మిగిలిన ఏడుగురు అభ్యర్థుల్లో ముగ్గురు అభ్యర్థులు నాట్ విల్లింగ్ ఇచ్చారు. మిగిలిన నలుగురు అభ్యర్థులకు శనివారం వెరిఫికేషన్ చేయనున్నట్లు డీఈఓ కిరణ్‌కుమార్ తెలిపారు. డీఎస్సీ జిల్లా పరిశీలకులు విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ తెహర సుల్తానా, స్పెషల్ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, డీఈఓ ఎ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో చేపట్టిన కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ వరప్రసాద్, డీసీఈబీ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు, డిప్యూటీ డీఈఓ చంద్రమౌలేశ్వరరావు ఎంఈఓలు కిషోర్ బాబు, శివాజీ, నాగేంద్ర వదన్ పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.