ఊళ్లకు బెల్ట్‌ ఉచ్చు.. కుటుంబాల్లో చిచ్చు! | - | Sakshi
Sakshi News home page

ఊళ్లకు బెల్ట్‌ ఉచ్చు.. కుటుంబాల్లో చిచ్చు!

Aug 30 2025 10:21 AM | Updated on Aug 30 2025 10:21 AM

ఊళ్లక

ఊళ్లకు బెల్ట్‌ ఉచ్చు.. కుటుంబాల్లో చిచ్చు!

తర్లుపాడు మండలంలోని ఓ గ్రామంలో బెల్ట్‌ షాపులో మద్యం తాగుతున్న వ్యక్తులను ఎకై ్సజ్‌ సిబ్బంది గుర్తించారు. వారి నుంచి అంతో ఇంతో డబ్బు గుంజేందుకు ప్రయత్నించారే గానీ దుకాణాన్ని తనిఖీ చేయలేదు. ఎవరిపైనా కేసు కట్టలేదు.

మార్కాపురం ఆర్టీసీ డిపోలో మంచినీటి కుళాయిల వద్ద మందుబాబులు బహిరంగంగా మద్యం తాగుతున్న ఫొటోలు గురువారం సోషల్‌ మీడియాలో వైరగా మారాయి.

దొనకొండలో బెల్ట్‌ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని ఇటీవల దర్శి ఎకై ్సజ్‌ ఎస్సై అదుపులోకి తీసుకోగానే 5 కార్లలో స్టేషన్‌పై దండయాత్ర చేశారు టీడీపీ నాయకులు. ఏకంగా ఎస్సైని బూతులు తిడుతూ ఉద్యోగమెలా చేస్తావో చూస్తామని బెదిరించిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది.

బేస్తవారిపేటకు చెందిన ఓ యువకుడు మద్యానికి డబ్బు ఇవ్వలేదని శుక్రవారం తన భార్యతో గొడవపడి వాస్మాల్‌ తాగి తనువు చాలించాడు.

నెల రోజుల క్రితం ముండ్లమూరు మండల పర్యటనకు వెళ్లిన కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాకు బెల్ట్‌ షాపుల దందా గురించి మహిళలు నేరుగా ఫిర్యాదు చేశారు. పక్కనే ఉన్న టీడీపీ నేతలు అదేమీ లేదంటూ కలెక్టర్‌నే బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారు. అంతటితోనే ఆ ఫిర్యాదు బుట్టదాఖలైంది.

సమాజంపై మద్యం చూపుతున్న ప్రభావం, కూటమి సర్కారు నిర్లక్ష్యం, అధికారుల తీరు, బెల్ట్‌ బాబుల దోపిడీని ఈ సంఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి.

మద్యం మహమ్మారి ఉచ్చులో చిక్కుకుని

ఊళ్లకు ఊళ్లు గుల్లవుతున్నాయి. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్న కూటమి నాయకులు గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్నారు. అన్ని వేళల్లో మద్యం అందుబాటులో ఉంటుండటంతో పూటుగా తాగిన మందుబాబులు వీధుల్లోనే పొర్లాడుతూ కుటుంబ సభ్యుల పరువు బజారున పడేస్తున్నారు. మద్యం కొనేందుకు డబ్బు కావాలని తల్లిదండ్రులను రాచిరంపాన పెట్టడమే

కాకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మద్యం అడ్డగోలు విక్రయాలను

నియంత్రించాల్సిన కూటమి ప్రభుత్వం

అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సందట్లో

సడేమియా అన్నట్టుగా బెల్ట్‌ బాబులను బెదిరించి కొందరు ఎకై ్సజ్‌ అధికారులు ఆమ్యామ్యాలు

గుంజుతున్నట్లు ఆరోపణలున్నాయి.

మార్కాపురం టౌన్‌:

ద్యం మహమ్మారి పల్లెల్లో అశాంతి రేకెత్తించడమే కాకుండా యువత ప్రాణాలు తీస్తోంది. కూటమి గద్దెనెక్కగానే ప్రభుత్వ మద్యం దుకాణాలను తొలగించి సొంత పార్టీ నేతలకు దండిగా ఆదాయం సంపాదించుకునేందుకు రాచబాట వేసిన సంగతి తెలిసిందే. మొత్తం మద్యం దుకాణాలను టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు కట్టబెట్టిన ప్రభుత్వం గ్రామాల్లో బెల్ట్‌ షాపులను తెరిచేందుకు ప్రత్యక్షంగానే కారణమైంది. నూతన మద్యం పాలసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నా కూటమి ప్రజాప్రతినిధులు ఏమాత్రం ఖాతరు చేయకపోగా లైసెన్స్‌డ్‌ దుకాణాల నిర్వాహకులతో బేరం కుదుర్చుకున్నారన్న విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సందుకొకటి.. గొందికొకటి!

కూటమి పార్టీల ఎమ్మెల్యేల ఆశీస్సులతోనే జిల్లాలో 1050కి పైగా బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి గ్రామంలో బడ్డీ కొట్లలా బెల్టుషాపులు వెలుస్తుండటం కూటమి ప్రభుత్వ ఉదాసీన వైఖరిని స్పష్టం చేస్తోంది. గ్రామాల్లో రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు వేలం పెట్టి మరీ బెల్ట్‌ షాపులు నిర్వహించుకునే వారిని ఎంపిక చేస్తున్నా ఎకై ్సజ్‌, పోలీస్‌ శాఖ అధికారులు చోద్యం చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది. లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాల నుంచి నేరుగా బెల్ట్‌ షాపులకు ఆటోలు, ఇతర వాహనాల్లో మద్యం తరలిస్తున్నా ఎకై ్సజ్‌ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారన్నా ఆరోపణలున్నాయి. బెల్టుషాపుల నిర్వాహకులంతా కూటమి పార్టీల సానుభూతిపరులే కావడంతో దాడులు చేయడానికి ఎకై ్సజ్‌ అధికారులు జంకుతున్నట్లు తెలుస్తోంది. మార్కాపురం మండలంలో 21 పంచాయతీలు ఉండగా సుమారు 16 గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలోని ప్రతి మండలంలోనూ నెలకొంది. బెల్ట్‌ షాపుల్లో మద్యం ఎమ్మార్పీ ధరలపై అదనంగా రూ.50 తీసుకుని అమ్ముతూ రోజుకు రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు నిర్వాహకులు పోగేసుకుంటున్నారు. ఈ సొమ్ములో ఎవరి వాటాలు వారికి పంపుతూ బెల్ట్‌ షాపులు దర్జాగా నిర్వహిస్తున్నారు.

మద్యం డోర్‌ డెలివరీ

ఒంగోలు, పొదిలి, మార్కాపురం, గిద్దలూరు, చీమకుర్తి తదితర పట్టణ ప్రాంతాల్లో మద్యం విక్రయాలు బైక్‌లపైనే సాగిస్తున్నారు. అర్ధరాత్రి వేళ సైతం ఫోన్‌ చేయగానే మద్యం డోర్‌ డెలివరీ చేస్తున్నారని స్థానికంగా చర్చ నడుస్తోంది. బడ్డీకొట్లలా ఏర్పాటైన మద్యం దుకాణాల్లో తగిన వసతులు కల్పిస్తూ మందుబాబులను మరింతగా ప్రోత్సహించే సంస్కృతి పల్లెల్లో పెరిగిపోయింది. మార్కాపురం ఎస్టేట్‌లో ప్రధాన రోడ్డుపైనే బెల్టుషాపులు నిర్వహిస్తూ, నాటుసారా విచ్చలవిడిగా విక్రయిస్తున్నా ఎకై ్సజ్‌ అధికారులు అటు వైపు కూడా కన్నెత్తి చూడటం లేదు.

దాబాల మాటున మద్యం విక్రయాలు

జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డు, కర్నూలు రోడ్డు, మార్కాపురం, గిద్దలూరు, పొదిలి ప్రాంతాల్లోని పలు దాబాల్లో మద్యం ఏరులై పారుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, స్థానిక కూటమి నాయకుల అండతో నిర్వహిస్తున్న ఈ దాబాలను పోలీసులు కూడా చూసీచూడనట్టుగా వదిలేయడంపై విమర్శలొస్తున్నాయి. కొన్ని దాబాల్లో ఆహారంతోపాటు అధిక ధరకు మద్యం విక్రయిస్తుండగా, మరికొన్ని చోట్ల మద్యం తెచ్చుకుని తాగేందుకు యథేచ్ఛగా అనుమతిస్తున్నారు. మార్కాపురం పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 10కి పైగా దాబాలు ఇదే రీతిలో నడుస్తున్నాయి.

బడ్డీ కొట్లలా వెలుస్తున్న మద్యం బెల్టు షాపులు వేళాపాల లేకుండా యథేచ్ఛగా మద్యం విక్రయాలు

ఒక్కో బెల్ట్‌ బాబుకు రోజూ రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు లాభం

నిర్వాహకులు కూటమి నేతలు కావడంతో కన్నెత్తి చూడని ఎకై ్సజ్‌ అధికారులు

ఊళ్లకు బెల్ట్‌ ఉచ్చు.. కుటుంబాల్లో చిచ్చు! 1
1/1

ఊళ్లకు బెల్ట్‌ ఉచ్చు.. కుటుంబాల్లో చిచ్చు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement