
గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు
కొత్తపట్నం: వినాయక విగ్రహాల నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. శుక్రవారం కొత్తపట్నం బీచ్ ప్రాంతాన్ని ఎస్పీ పరిశీలించారు. రాములవారి ఆలయం వద్ద పార్కింగ్ ప్రదేశం, సముద్ర తీరంలో బారికేడ్లు, నిమజ్జన ప్రదేశాలు, మైక్‌లు, లైటింగ్, వైద్యశిబిరాల ఏర్పాట్లను పరిశీలించి, స్థానిక అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ.. జిల్లాలో 1000కి పైగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారని, తీరప్రాంతానికి 700 విగ్రహాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బీచ్‌లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదు డ్రోన్లతో పహరా కాయడంతోపాటు 15 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. సముద్రం లోపలికి భక్తులు, పర్యాటకులు వెళ్లకుండా ఇసుక బస్తాలతో హెచ్చరిక గుర్తులు పెట్టామన్నారు. చిన్న పిల్లలతో వచ్చే వారు జాగ్రత్తలు పాటించాలని, నిర్దేశత సమయాల్లో విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు. గజ ఈతగాళ్లకు టీషర్ట్‌లు పంపిణీ చేశారు. డీజే వాహనాలను కొత్తపట్నం బయటే ఆపేయాలని పోలీసులను ఆదేశించారు. ఎస్పీ వెంట మహిళా పోలీస్ ష్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, కొత్తపట్నం ఎస్సై వేముల సుధాకర్‌బాబు, వెంకటకృష్ణయ్య, మైరెన్ ఎస్సై పి.సుబ్బారావు ఉన్నారు. అనంతరం కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తులో పురోగతి సాధించాలని ఎస్సైని ఆదేశించారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్ వెల్లడి
కొత్తపట్నం సముద్ర తీరంలో పరిశీలన