
పొలాల్లో పులి.. అప్రమత్తంగా ఉండాలి
బేస్తవారిపేట: గ్రామాల్లో పులి అడుగుజాడలు కనిపిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌ఆర్‌ఓ మధుప్రియాంక సూచించారు. శుక్రవారం బేస్తవారిపేట మండలంలోని పూసలపాడు, ఒందుట్ల, చెట్టిచర్ల, జేబీకే పురం, లక్ష్మీపురం గ్రామాల్లో పులి పాదముద్రలను గాలించారు. పులి, చిరుత పులి సంచరిస్తున్నట్లు పాదముద్రలు గుర్తించామన్నారు. దరగ కొండ నుంచి బేస్తవారిపేట మండలంలోని పూసలపాడు పరిసర ప్రాంతాల్లోకి పులి వెళ్లినట్లు నిర్ధారణ అయిందన్నారు. రైతులు రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కంచెల వద్ద వలలు, విద్యుత్ పెట్టవద్దని రైతులకు అవగాహన కల్పించారు. పశువులపై దాడి చేస్తే వాటి దగ్గరకు వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పలుచోట్ల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓలు ఆనందరావు, రంగారెడ్డి, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.