
క్యాడర్‌కు అండగా నిలుస్తా
చంద్రబాబు మోసాలను ఎండగడదాం ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున
మద్దిపాడు: కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తానని మాజీమంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో పలు హామీలు ఇచ్చారని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా నెరవేర్చలేదని అన్నారు. చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేదొకటి అన్న విషయం ప్రజలకు తెలిసినా 2024 ఎన్నికల్లో మరోమారు మోసపోయారని ఆయన అన్నారు. రైతులకు పూర్తిగా అండగా నిలుస్తానని, వారికి మద్దతు ధరలు ప్రకటించి రైతులను ఆదుకుంటానని చెప్పిన చంద్రబాబు పొగాకు రైతుల నడ్డి విరిచారని అన్నారు. డ్వాక్రా మహిళలకు అది చేస్తాం ఇది చేస్తామంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఒక్క సిలిండర్ అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నాడని విమర్శించారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు దాటవేత ధోరణి అవలంబిస్తున్నాడని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నాడని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన పార్టీ కార్యకర్తలకు తాను అండగా నిలుస్తానని, ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నాన్ని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు చంద్రబాబు మోసాలను తెలపడానికే క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేశారని, గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ చంద్రబాబు మోసాలను తెలుపుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులు పనిచేసి వైఎస్ జగన్‌ను మరోమారు ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. గ్రామ పార్టీ అధ్యక్షునిగా జవ్వాజి లక్ష్మీనారాయణ రెడ్డిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, గ్రామ సర్పంచ్ కొప్పోలు ఆంజనేయులు, ఎంపీటీసీ పల్లకి పద్మ, నాయకులు వల్లంరెడ్డి బాలాంజనేయరెడ్డి, వైస్ ఎంపీపీ పైడిపాటి వెంకట్రావు, పల్లపాటి అన్వేష్, నాదెండ్ల మహేష్, రాయపాటి విల్సన్, డేనియల్, భాను చంద్ర, కంకణాల సురేష్, గ్రామ నాయకులు యేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, పల్లకి సత్యనారాయణ రెడ్డి, లింగ సంజీవరెడ్డి, తదితర నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పలువురు పాల్గొన్నారు.