
సోలార్ పథకానికి భూములు కేటాయించాలి
ఒంగోలు సబర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కుసుమ్ సోలార్ పథకానికి జిల్లాలో భూములు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ ఆదేశించారు. ఆయన తన ఛాంబర్‌లో ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు, విద్యుత్ అధికారులు, నెడ్‌క్యాప్, రెవెన్యూ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఫీడర్ లెవల్ సోలరైజేషన్ ప్రోగ్రాం కోసం భూ కేటాయింపులు వేగంగా జరగాలన్నారు. అందుకోసం 121.75 ఎకరాల ప్రభుత్వ భూమి, 378 ఎకరాల పట్టా భూములను గుర్తించినట్లు అధికారులు జాయింట్ కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పట్టా భూముల విషయంలో రైతుల అంగీకారంతో ఆయా భూములను లీజు ఆధారంగా సేకరించి భూ కేటాయింపులు తక్షణమే చేపట్టాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ బీసీహెచ్ ఓబులేసు, మార్కాపురం సబ్ కలెక్టర్, మార్కాపురం, కనిగిరి సబ్ డివిజనల్ రెవెన్యూ అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.