
ఏడాది పాలన మోసాలమయం
ఎన్నికల ముందు మోసపు హామీలు గెలిచాక మోసగించడం చంద్రబాబు నైజం రాష్ట్రంలో పెరిగిన దాడులు, అఘాయిత్యాలు బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్)/నాగులుప్పలపాడు: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని, ఎక్కడ చూసినా మోసాలమయమైందని సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సంతనూతలపాడు మండలంలోని పి.గుడిపాడు, కొనగానివారిపాలెం గ్రామాల్లో, నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెం, నాగులుప్పలపాడు గ్రామాల్లో ఆదివారం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. సంతనూతలపాడులో మండల పార్టీ అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి అధ్యక్షతన వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎన్నికల ముందు ముసలి కన్నీరు కార్చి అధికారంలోకి వచ్చిన తరువాత వెన్నుపోటు పొడవటం చంద్రబాబుకు అలవాటే అన్నారు. ఎప్పుడు ఎన్నికల్లో పోటీచేసినా ఏదో ఒక పార్టీ మద్దతుతో కల్లబొల్లి మాటలు చెప్పడం.. గెలిచిన తరువాత ప్రజల్ని మర్చిపోవడం ఆయన నైజమన్నారు. సూపర్‌సిక్స్ పేరుతో ఇంటింటికీ తిరిగి కూటమి నాయకుల ఫొటోలు వేసుకుని బాండ్లు పంపిణీ చేశారని, ఆ బాండ్లలో ఉన్న అంశాలను ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారిపై అరెస్టులు, అసత్య ప్రచారాలు, కేసులుపెట్టి భయభ్రాంతులకు గురి చేయడం సర్వసాధారణమైందని విమర్శించారు. అన్నదాతకు ఎరువులు కొరత, పండించిన పంటకు మద్ధతు ధర లేదన్నారు. ప్రతి పనికి దోచుకోవడం, దాచుకోవడం అన్నట్లు పనులు చేస్తున్న టీడీపీ నాయకులు అవినీతి కూపంలో కూరుకుపోయారని విమర్శించారు. పొగాకు రైతులను, మిర్చి రైతులను చంద్రబాబు చేసిన మోసం వారు జీవితంలో మరచిపోరన్నారు. బర్లీ పొగాకు కొనుగోళ్లలో పార్టీలు చూసి కొనుగోలు చేస్తున్న ఈ ప్రభుత్వం, జగన్‌మోహన్ రెడ్డి పాలన ఎలా చేశాడో చూసి సిగ్గు తెచ్చుకోవాలన్నారు. కూటమి దౌర్జన్య పాలనకు చరమగీతం పాడాలంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్ ను నాగార్జున, నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ బీ విజయ, మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, దుంపా ఎలమందరెడ్డి, సర్పంచ్ కుంచాల పుష్ప సుబ్బారావు, సంతనూతలపాడు సర్పంచ్ దర్శి నాగమణి, నాగులుప్పలపాడు మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, దివ్యాంగుల విభాగం రాష్ట్ర కార్యదర్శి కాట్రగడ్డ శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు తానిపర్తి శేషురెడ్డి, గొడుగు కాలేషా, మహిళా విభాగం అధ్యక్షురాలు సీతమ్మ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఏడాది పాలన మోసాలమయం