తాడేపల్లి : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినవి అనుచిత వ్యాఖ్యలేనని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ మహిళా నేత విడదల రజిని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును తెల్ల ఏనుగుతో పోల్చుతారా? అంటూ మండిపడ్డారు. ప్లాంట్ నిర్వహణ చంద్రబాబుకు భారంగా మారిందని, అందుకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉరేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు(మంగళవారం, నవంబర్ 18వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన రజిని.. చంద్రబాబు మైండ్ సెట్ ఎప్పుడూ ప్రైవేటీకరణే అని విషయం మరోసారి రుజువైందన్నారు.
‘పేదరిక నిర్మూలన కాదు, పేదలనే నిర్మూలించాలన్నట్టుగా చంద్రబాబు ఆలోచనలు ఉంటాయి. ఎన్నికలకి ముందు ప్లాంటు కోసం పోరాడతామన్నారు. అధికారంలోకి వచ్చాక తెల్ల ఏనుగుతో పోల్చుతున్నారు. వైఎస్ జగన్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటూ వచ్చారు. కేంద్రానికి లేఖలు రాయటమే కాదు, సభల్లో కూడా ప్రధాని మోదీని నేరుగా అడిగారు. ప్లాంటు బాగు కోసం జగన్ అన్ని ప్రయత్నాలూ చేశారు.
కానీ చంద్రబాబు మాత్రం ప్లాంటుకు ఉరి బిగించి ఆ తాడును కేంద్రం చేతిలో పెట్టారు. చంద్రబాబును నమ్ముకుని ఏ వర్గమూ బాగు పడలేదు. రైతులతో సహా ప్రతి వర్గమూ రోడ్డున పడింది.ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికుల పరిస్థితి దారుణంగా తయారయింది. లక్షలాది కార్మికులు, ఉద్యోగుల జీవితాలను రోడ్డున పడేశారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కుట్రను చంద్రబాబు ఆపేయాలి. వీలైతే మంచి చేయాలే తప్ప నాశనం చేయొద్దు. వైఎస్సార్ సీపీ కార్మిక పక్షమే. స్టీల్ ప్లాంటును కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తాం’ అని ఆమె స్పష్టం చేశారు.


