సాక్షి, తాడేపల్లి: సనాతన ధర్మ పరిరక్షకులమని గొప్పలు చెప్పుకునే కూటమి పార్టీల నేతలు, కనీసం హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఆదిదేవుడు వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి నీళ్లు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పలుచోట్ల నిమజ్జనానికి నీళ్లు లేక విగ్రహాలను ఎండిన కాలువలు, వాగుల్లో అలానే వదిలిపెడుతున్న హృదయ విదారక దృశ్యాలు చూస్తే ప్రతి హిందువు హృదయం కలుక్కుమంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతల హిందుత్వం ఇప్పుడు ఎక్కడికి పోయిందని, కనీసం నిమజ్జనానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. మరోవైపు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిందంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యంత నిస్సిగ్గుగా మాట్లాడిన పచ్చి అబద్ధాలన్నీ సుప్రీంకోర్టు ఆదేశాలతో నడుస్తున్న సిట్ నివేదిక ద్వారా తేలిపోయాయని స్పష్టం చేశారు.
ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారికి వత్తాసు పలికిన ఎల్లో మీడియా తమ ముఖాలను ఎక్కడ పెట్టుకుంటారని నిలదీశారు. చేసిన మహా పాపానికి వెంకటేశ్వరస్వామి వారికి, భక్తులకు కచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలని, లేనిపక్షంలో ఆ ఏడుకొండలవాడి శాస్తి తప్పదని వెల్లంపల్లి తీవ్రంగా హెచ్చరించారు.
వినాయక చవితిపైనా కూటమి నిర్లక్ష్యం
వినాయక చవితి అనేది పసిపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి హిందువు అత్యంత పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద పండుగ. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భక్తులు మండపాలు వేసి పూజలు చేసుకుంటే, కనీస ఏర్పాట్లు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసింది. వెన్నుపోటు పాలనలో ఆదిదేవుడైన గణనాథుడికి కూడా తీరని అపచారం జరుగుతోంది.
ఎండిన కాలువల్లో గణనాథులు..
అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం వద్ద హెచ్ఎల్సీ కాలువలో నీరు లేక, ఎల్లనూరు ప్రాంతంలో చిత్రావతి పరిసరాల్లో నీటి కొరత వల్ల పూజలు అందుకున్న విగ్రహాలను మట్టిలో, ఎండిన కాలువల్లో వదిలేయాల్సిన దారుణ పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వానికి, అధికారులకు ముందే తెలుసు. అటువంటప్పుడు నిమజ్జనం కోసం ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న కుంటలు, కాలువలు ఎందుకు తవ్వించలేదు?. నిమజ్జనానికి నీళ్లు వదలాలనే కనీస జ్ఞానం చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి లేదా?.
ఇళ్లల్లో పూజలు.. వీడియోలకే పరిమితమైన నేతలు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ ఇళ్లల్లో పూజలు చేసుకుని, నాలుగు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వదిలేస్తే గొప్ప హిందూ భక్తులు అయిపోతారా? ఊర్లలో సామాన్య ప్రజలు వినాయక చవితిని ఎలా జరుపుకుంటున్నారు, నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయనే సోయి ఈ పాలకులకు ఏమాత్రం లేదు. ఉచిత కరెంటు ఇస్తున్నామంటూ పందిళ్లపై వందల కొద్దీ ఆంక్షలు పెట్టి భక్తులను తీవ్రంగా వేధించారు.
వైజాగ్‌లో పోలీసుల వేధింపులు..
విశాఖపట్నంలో భక్తులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి మండపాలు వేసుకుంటే, పోలీసులు వెళ్లి బెదిరించి మండపాలు తీసేయమంటున్నారు. ఒకపక్క సకల శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో నీతులు చెబుతుంటే, గ్రౌండ్‌లో మాత్రం అన్నదానాలు, పూజలు చేసుకోకుండా ట్రాఫిక్ పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. కూటమిలో ఉన్న బీజేపీ నేతలను సూటిగా అడుగుతున్నాను.. జై శ్రీరామ్, జై గణేష్ అనే మీరు, మీ ప్రభుత్వంలో గణనాథుడికి జరుగుతున్న ఈ ఘోర అవమానంపై ఎందుకు నోరు మెదపడం లేదు?.
సిట్ నివేదికతో బట్టబయలైన లడ్డూ అసత్యాలు
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అత్యంత దిగజారి విష ప్రచారం చేశారు. లడ్డూలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె, బాత్రూములు కడిగే కెమికల్స్ కలిపారంటూ సీఎం స్థానంలో ఉండి చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. అయోధ్య రామాలయానికి పంపిన లక్ష లడ్డూలపై కూడా విషం చిమ్మి దేశవ్యాప్తంగా భక్తులను క్షోభకు గురిచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో పనిచేస్తున్న సిట్ ఇచ్చిన నివేదికలో ఎక్కడా జంతువుల కొవ్వు గానీ, కల్తీ గానీ జరిగినట్లు తేలలేదు.
పవన్ కళ్యాణ్ దీక్షల డ్రామాలు.. ఎల్లో మీడియా విషం
సనాతన ధర్మం అంటూ 11 రోజులు దీక్షలు చేసి, దుస్తులు మార్చి, గుడి మెట్లు కడిగి మీడియా ముందు ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? రాజకీయ స్వార్థం కోసం, వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని ఇంత నీచానికి ఒడిగడతారా? తిరుపతి లడ్డూపై పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించిన ఏబీఎన్, టీవీ5 లాంటి ఎల్లో మీడియా ఇప్పుడు ఎక్కడ దాక్కుంటుంది?
కొండపైకి నడిచి వెళ్లి క్షమాపణ చెప్పాల్సిందే..
ల్యాబ్‌కు పంపిన ఆ నెయ్యి ట్యాంకర్లు, శాంపిల్స్ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫరా అయినవన్న విషయం స్పష్టమైందని వెల్లంపల్లి తెలిపారు. ఈ నేపథ్యంలో చేసిన ఘోర అపచారానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలు, ఎల్లో మీడియా చెంపలు వేసుకోవడంతో పాటు.. తిరుమల కొండపైకి నడుచుకుంటూ వెళ్లి, స్వామివారి పాదాల చెంత సాష్టాంగపడి భక్తులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని.. దేవుడే తగిన శాస్తి చేస్తాడని హెచ్చరించారు.
ఇదీ చదవండి: వైఎస్ జగన్ వార్నింగ్‌తో దిగొచ్చిన చంద్రబాబు


