సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా కూడా పనిచేసిన దానం నాగేందర్ 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరి ఆసిఫ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలిచి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో స్థానం పొందారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో ఓడిపోయారు. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి వరుసగా రెండుసార్లు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే పార్టీ మారిన దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలంటూ బీఆర్‌ఎస్ చేసిన న్యాయ పోరాటం నేపథ్యంలో తాజాగా ఆయనపై అనర్హత వేటు వేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది.
దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం
22 జూన్ 2018: కాంగ్రెస్‌కు దానం నాగేందర్ రాజీనామా
24 జూన్ 2018: కేసీఆర్ సమక్షంలో దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరిక.
30 నవంబర్ 2018: బీఆర్‌ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నిక.
3 డిసెంబర్ 2023: ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ రెండోసారి విజయం.
15 మార్చి 2024: సీఎం రేవంత్ సమక్షంలో దానం కాంగ్రెస్ పార్టీలో చేరిక.
18 మార్చి 2024: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్.
10 ఏప్రిల్ 2024: తామిచ్చిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపిస్తూహైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్.
15 ఏప్రిల్ 2024: దానం నాగేందర్, అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ.
23 ఏప్రిల్ 2024: సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ నామినేషన్ దాఖలు
1 జూలై 2024: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా దానం నాగేందర్‌పై స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్ దాఖలు
9 సెప్టెంబర్ 2024: అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లో స్పీకర్ విచారణ షెడ్యూలు ఖరారు చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశం
22 నవంబర్ 2024: హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలను పక్కన పెట్టిన డివిజన్ బెంచ్. అనర్హత పిటిషన్లను సహేతుకమైన సమయంలో స్పీకర్ నిర్ణయిస్తారని ప్రకటన.
31 జూలై 2025 : 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశం.
డిసెంబర్ 2025– ఫిబ్రవరి 2026: దశలవారీగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయాలు. దానం, కడియం అంశం చివరిదాకా పెండింగ్.
6 ఫిబ్రవరి 2026: మూడు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ధిక్కరణ చర్యలు తప్పవన్న సుప్రీంకోర్టు.
11 మార్చి 2026: దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్.
23 మార్చి 2026: స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన బీఆర్‌ఎస్
ఏప్రిల్ 2026: దానం అనర్హత వ్యవహారంపై హైకోర్టులో కొనసాగిన విచారణ
26 జూన్ 2026: దానం నాగేందర్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలకు కౌంటర్ల దాఖలుకు హైకోర్టు తుది అవకాశం
21/22 ఆగస్టు 2026: దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై తీర్పు రిజర్వు.
18 సెపె్టంబర్ 2026: దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు ధర్మాసనం.


