
సాక్షి, అమరావతి: అగ్రనటుడు చిరంజీవిని అసెంబ్లీ సాక్షిగా టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అవమానించడంపై మెగా ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. అదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడడంపైనా వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో బాలయ్యను ఇరు వర్గాలు బంతాట ఆడుకుంటున్నాయి.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ రెచ్చిపోయారు. మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాడెవడు అంటూ నోరుపారేసుకున్నారు. అయితే, బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో సీఎం చంద్రబాబు సహా జనసేన ఎమ్మెల్యేలు కూడా స్పందించకపోవడంపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై స్పందించాలంటూ చిరంజీవి అభిమానులు పవన్ కల్యాణ్‌ను సైతం కోరుతున్నారు. సోషల్‌మీడియాలో బాలయ్యను ట్రోల్ చేస్తున్నారు.
మరోవైపు.. అసెంబ్లీలోనే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై కూడా బాలకృష్ణ అనుచితంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు.. బాలకృష్ణపై మండిపడుతున్నారు. నోరు అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నారు. బాలకృష్ణ మానసిక స్థితిని పరీక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీకి, సినిమా ఫంక్షన్‌కు తేడా తెలియకుండా మాట్లాడారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీదున్న కోపాన్ని వైఎస్ జగన్ మీద చూపిస్తే ఎలాగంటూ ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు .
