‘బాబుకు నో విజన్‌.. కేవలం రాజకీయ అవకాశవాదమే’ | YSRCP Sake sailajanath Satirical Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘బాబుకు నో విజన్‌.. కేవలం రాజకీయ అవకాశవాదమే’

Dec 28 2025 12:07 PM | Updated on Dec 28 2025 1:25 PM

YSRCP Sake sailajanath Satirical Comments On Chandrababu

సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజన్ లేదు.. కేవలం రాజకీయ అవకాశవాదమే ఉంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌. చంద్రబాబు పాలనలో దాడులు, దౌర్జన్యాలు తప్పా ఏమీ లేవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి శైలజానాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తప్పించుకున్నవాడు ధన్యుడు అన్నట్లు చంద్రబాబు హామీల అమలు నుంచి తప్పించుకుంటున్నారు. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగడాన్ని టీడీపీ కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.  వైఎస్ జగన్ అభిమానులు మాంసం తినటమూ తప్పేనా?. పొట్టేళ్లు, కోళ్లు ఎలా తినాలో ప్రభుత్వం చెప్పాలా?. జంతు బలి చట్టాలను టీడీపీ కూటమి నేతలు తెలుసుకోవాలి. చంద్రబాబు పాలనలో దాడులు, దౌర్జన్యాలు తప్పా ఏమీ లేవు. వైఎస్ జగన్‌కు రోజు రోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. 

వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ఒకటి, రెండు చోట్ల ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్లు కొడితే, అది పెద్ద నేరం అన్నట్లు.. రాష్ట్రంలో గతంలో ఎక్కడా అలా జంతు బలి జరగనట్లు మీరు (సీఎం చంద్రబాబు), మీ హోం మంత్రి మాట్లాడుతున్నారు. దాని వల్ల సమాజం నాశనమై పోతున్నట్లు నిందిస్తున్నారు. యువతను ప్రభావితం చేస్తున్నట్లు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. అలా చేసి హింసను ప్రేరేపిస్తున్నారు కాబట్టి, రాష్ట్ర బహిష్కరణ చేస్తామని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. మరి జాతరలు, గ్రామోత్సవాల్లో కూడా జంతు బలులు సహజం. వాటిని కూడా తప్పు పడుతున్నారా? మొక్కుల కోసం జంతు బలి ఇచ్చిన వారిపైనా చర్యల తీసుకుంటారా? లేదా రాష్ట్రంలో జంతు బలులనే నిషేధిస్తారా?.
    
వైఎస్‌ జగన్‌ ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్ల బలిని అంతగా తప్పు పడుతున్న మీకు.. హిందూపురంలో మీ బావమరిది నందమూరి బాలకృష్ణ గెలుపు తర్వాత పదుల సంఖ్యలో పొట్టేళ్లు నరికి, వాటి తలకాయలతో ఆయన ఫ్లెక్సీకి దండ వేశారు. అది కనిపించడం లేదా బాబు?. ఇంకా 2023లో మీ (చంద్రబాబు) పుట్టినరోజు సందర్భంగా మీ పార్టీ కార్యకర్తలు పొట్టేళ్లు నరికి, రక్తంతో మీ ఫ్లెక్సీకి రక్త తర్పణం చేశారు. అంతెందుకు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున, అనేకచోట్ల మీ ఫ్లెక్సీలు పెట్టి, బహిరంగంగా పొట్టేళ్లు నరికి, ఆ రక్తాన్ని మీ ఫ్లెక్సీలకు తర్పణం చేశారు. అవన్నీ నిజం కాదా? మరి వాటికేం సమాధానం చెబుతారు?. కదిరి దగ్గర జనసేన కార్యకర్త ఇంట్లో చిన్న గలాటా జరిగితే, దాన్ని కూడా వైఎస్సార్‌సీపీకి అంటగట్టి బురదచల్లే ప్రయత్నం చేశారు. చివరకు ఆ యువకుడి సోదరి, పూర్తి వివరాలు స్వయంగా చెప్పింది.

మెడికల్‌ కాలేజీలు, శాంతిభద్రతల వైఫల్యం కప్పిపుచ్చేందుకే..
రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే.. శాంతిభద్రతలు ఛిద్రమవుతుంటే.. గంజాయి బ్యాచ్‌లు పెరుగుతూ పదులు, వందల కేజీల్లో గంజాయి దొరుకుంటే.. మీ నేతలు తప్పుడు పత్రాలతో దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటుంటే.. సగటు మనుషులు బిక్కుబిక్కుమంటూ పోలీసు స్టేషన్లకు వెళ్తుంటే.. ఎమ్మెల్యేలు చెప్పాలని వారు తిప్పి పంపిస్తుంటే ఇవన్నీ మీకు కనిపించడం లేదా? కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శాంతిభద్రతలపై మీకు లేఖ రాయలేదా? శాంతిభద్రతలే కాదు, ఏమీ లేదు ఇక్కడ.

రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేదు. ఉద్యోగాలు లేవు. పెట్టుబడులు లేవు. ఆలయాలకు రక్షణ లేదు. అన్ని చోట్లా మీ పార్టీ దుర్మార్గమైన ఆలోచనలతో ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నారు. ఇవన్నీ కప్పి పుచ్చేందుకు ఇలా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ఇంకా, మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు నిర్ణయిస్తే, మీరు చేస్తున్న అవినీతి, అక్రమ వ్యవహారం అర్థమై, ఎవరూ బిడ్‌ వేయలేదు. అందుకే ఒక్కటంటే ఒక్కటీ సరైన బిడ్‌ రాలేదు. జగన్మోహన్‌రెడ్డిపై నమ్మకంతోనే మెడికల్‌ కాలేజీల బిడ్లు వేయడానికి ఎవరూ రాలేదు. వీటన్నింటి నుంచి డైవర్షన్‌ కోసం, ఇప్పుడు ఫ్లెక్సీలు, రక్త తర్పణాలు అంటూ అనవసర రచ్చ చేస్తున్నారు.

పోలీసులూ అది గుర్తు చేసుకోండి.. 
పోలీసు అధికారులకు కూడా చెబుతున్నాం. మీరు ఈ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవడం తగదు. టీడీపీ ప్రభుత్వంపై ప్రమాణం చేసి మీరు ఉద్యోగాల్లోకి రాలేదు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగాల్లోకి వచ్చారు. అనంతపురంలో రోడ్డు వేస్తుంటే టీడీపీ దిమ్మె కూలగొట్టారు.  ఇక్కడ కాంట్రాక్టర్‌ మీ వాడు. అధికారులు మీ చెప్పుచేతల్లో ఉన్న వాళ్లు. జేసీబీ డ్రైవర్‌ కూడా మీవాడే. కానీ జనం మీద బలం చూపిస్తామంటే కుదరదు. పోలీసు శాఖ ఉన్నది న్యాయాన్ని రక్షించడం కోసం. ప్రజలకు రక్షణ కల్పించడం కోసం. అంతేకానీ, అధికార పార్టీ వారు చెప్పిందే చేయడం కోసం కాదు అని స్పష్టం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement