‘సంక్షేమ రాజ్యం సృష్టికర్త సీఎం జగన్’ | YSRCP Samajika Sadhikara Bus Yatra parvathipuram manyam Meeting | Sakshi
Sakshi News home page

‘సంక్షేమ రాజ్యం సృష్టికర్త సీఎం జగన్’.. మన్యం సీమలో  సాధికార యాత్రకు జనం నీరాజనం

Published Fri, Nov 10 2023 8:38 PM | Last Updated on Fri, Nov 10 2023 8:58 PM

YSRCP Samajika Sadhikara Bus Yatra parvathipuram manyam Meeting - Sakshi

సాక్షి, పార్వతీపురం మన్యం: చంద్రబాబు పాలన కరువు, అరాచకం, దౌర్జన్యాలు, దోపిడీకి తార్కాణంగా నిలిస్తే.. జగన్ సంక్షేమ పాలనలో అభివృద్ధి దిశగా రాష్ట్రం ఉరకలు వేస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. శుక్రవారం  పార్వతీపురం మన్యం జిల్లాలో కేంద్రంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించి.. అనంతరం బహిరంగ సభలో వాళ్లు ప్రసంగించారు. 

వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు మన్యం సీమలో జనం నీరాజనం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గంలో సాధికార బస్సు యాత్రకు అడుగడుగున ‘జై జగన్’ హర్ష ధ్వానాల మధ్య అపూర్వ స్వాగతం లభించింది. నియోజకవర్గంలో నాలుగన్నరేళ్లలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు,పార్టీ నేతలు ప్రజలకు తెలియజేశారు. యాత్రలో డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర,  బూడి ముత్యాల నాయుడు, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు అలజంగి జోగారవు, పాముల పుష్పశ్రీ వాణి పాల్గొని.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.

డిప్యూటీ సీఎం రాజన్నదొర మాట్లాడుతూ.. 
గిరిజనులకు, బడుగు, బలహీలన వర్గాలకు  సీఎం జగన్ చేస్తున్న మేలును ఎన్నడూ మరిచిపోకూడదని, మరిస్తే మనకే ఇబ్బందులు.. కష్టాలు వస్తాయి. ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీల కోసం జగన్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. గతంలో ఎన్నడైనా సరే ఇంత మొత్తంలో సంక్షేమం కోసం ఖర్చు చేశారా?. ఎస్సీల కోసం గత ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, జగన్ రూ. 61 వేల కోట్లు ఖర్చు చేశారు. బీసీల కోసం రూ. లక్షా 62 వేల కోట్లు ఖర్చు చేశారు.  గిరిజనుల కోసం రూ. 20వేల కోట్ల రూపాయలు జగన్ ఖర్చు చేయగా..  చంద్రబాబు కేటాయింపులే పూర్తిగా చేయలేదు. చంద్రబాబు హయాంలో కేబినెట్ లో గిరిజనులకు మంత్రి పదవి కేటాయించలేదు.  జీసీసీ కి చైర్మన్ ను వేయలేదు. ఎస్టీ కమిషన్ ను కూడా నియమించలేదు. పోడు, బీడు, బంజరు భూములను గిరిజనులకు  జగన్ పంపిణీ చేస్తే.. భూపంపిణీ హామీని చంద్రబాబు మరిచిపోయారు. గిరిజనులకు  రెండెకరాలు  భూమి ఇస్తానని చెప్పి టీడీపీ మోసం చేసింది.  గిరిజనులను మోసగించిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే వైఎస్‌ జగన్‌ను గెలిపించుకుని మళ్లీ సీఎంను చేయాలి.  

రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. 
మా జెండా కట్టాలి.  మా రంగుచొక్కా ధరించాలి. మాకే ఓటు వేయాలి అని బెదిరించి గతంలో చంద్రబాబులాంటి వారు అణగారిన వర్గాలను  అణిచివేశారు. చంద్రబాబు పరిపాలనలో కరవు,అరాచకం,దౌర్జన్యాలు,దోపిడీలు రాజ్యమేలాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగున్నరేళ్లుగా కులాలకు, మతాలకు అతీతంగా  సంక్షేమ పథకాలు అందాయి. అర్హులైన సామాన్యులకు లబ్ధి చేకూరేలా పాలన కొనసాగుతోంది. పేదల కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తూనే..  విద్యా, వైద్యం పరంగా ఉచితంగా సేవలు, ఉండడానికి ఇల్లు అందిస్తోంది మన ప్రభుత్వం. కానీ, చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారు. పార్వతీపురం చుట్టూ అనేక ఉద్యమాలు పుట్టాయి.  సమాజంలోని అసమానతల కారణంగా పోరాటాలు వచ్చాయి. ఇప్పుడు జగన్ పాలన కారణంగా ఎటువంటి ఆందోళనలు లేవు. అందరికీ సంక్షేమం అందుతోంది. 

రూ. 12,800 కోట్లతో భూమి కొనుగోలు చేసి.. రాష్ట్రంలో 32 లక్షల మందికి సొంతింటి కలను జగన్ నెరవేరుస్తున్నారు. గతంలో పాలకులు ఎవరైనా సరే ప్రజలకు సొంత గూడు కల్పించాలన్న ఆలోచన చేశారా?. నిరుత్సాహం, నిస్పృహతో అల్లాడుతున్న ప్రజల కోసం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో గతంలో  విద్య ప్రైవేటు పరమైపోయింది. ఎవరు కోరుకోకుండానే ప్రైవేటు విద్య ఎందుకు వచ్చింది?. ధనవంతులకు మాత్రమే విద్య పరిమితమైన పరిస్థితుల్లో.. సీఎం జగన్‌ విద్యాసంస్కరణలు తెచ్చారు.  పేదలకు ఉన్నత విద్య ఉచితంగా అందిస్తున్నారు. ప్రైవేటు స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను తీర్చిదిద్దారన్నారు.  దివంగత మహానేత వైఎస్సార్‌, ఆయన తనయుడు జగన్‌.. వీళ్లు ఎప్పుడూ పేదలు, రైతుల బాగుకోసం ఆలోచన చేస్తారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. కానీ, చంద్రబాబు మాత్రం పెత్తందారుల కోసమే పని చేస్తుంటారు. అసలు పార్వతీపురం ప్రాంతానికి చంద్రబాబు అధికారంలో ఉండగా ఏం చేశారు?. 

పార్వతీపురం  ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ.. 
పాదయాత్రలో పేదల కష్టాలను గమనించిన జగన్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారు. కేవలం ప్రజలకు జవాబుదారీతనం ఉండేలా పాలన చేయడం జగన్ అభిమతం. ఒక్క పార్వతీపురం నియోజకవర్గంలోనే రూ. 1200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ప్రభుత్వ పాలనలో ‘మా జీవన ప్రమాణాలు పెరిగాయి’ అని ప్రజలు చెబుతున్నారు. అంటే.. ఎంతటి సంక్షేమ పాలన జగన్ అందిస్తున్నారో అర్థం చేసుకోవాలి. సంక్షేమ సారథిగా  పాలన సాగిస్తున్న సీఎం జగన్‌కు మనమంతా అండగా నిలవాలి. 

కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. 
సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. గత ప్రభుత్వాల పాలనలో వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ప్రజలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. టీడీపీ నేత చంద్రబాబు తనకు నిజాయితీ, దూరదృష్టి ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దూరదృష్టి అంటే బాబు తన తనయుడు లోకేశ్ ఎలా సీఎం చేసుకుందామా? అనే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోనే తీసేసిన పార్టీకి నిజాయితీ ఎక్కడ ఉంది?.  రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అత్యున్నత స్థానం కల్పించడం.. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు తేవడం.. గిరిజన ప్రాంతాల్లో మెడికల్.. ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఇవి నిజాయితీ, దూరదృష్టి అంటే. అవి సీఎం జగన్‌కు సొంతం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement