సాక్షి, చిత్తూరు: సంక్రాంతి అంటే రైతులు సంతోషంగా జరుపుకునే పండగ అని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి ఆర్కే రోజా. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, సంతోషంగా ఉంటుందని నమ్మిన వారు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే నేడు వైఎస్ జగన్ అని అన్నారు. చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలోని తన నివాసం వద్ద భోగి సంబరాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. రాష్ట్రంలో ప్రజలు పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. రైతులు సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. రైతులకు 20వేలు ఇస్తామని చెప్పి, కొందరికే 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మామిడి రైతులు పండగ జరుపుకునే పరిస్థితి లేదు. చిత్తూరు జిల్లాలో 40 వేల మంది మామిడి రైతులకు 400 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నాళ్లు రైతులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు, రైతులకు ఏం మేలు చేస్తారు?.
రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, సంతోషంగా ఉంటుందని వైఎస్సార్, వైఎస్ జగన్ నమ్మారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినా చంద్రబాబు ఒక్క మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలేదు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వారికి మేలు చేస్తున్నారు. చంద్రబాబు ఉచితం అనే మాటలను నమ్మవద్దు అంటూ ప్రజలకు హితవు లిపాకరు. ఈ క్రమంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.


