
సాక్షి, గుంటూరు: లిక్కర్ స్కాం కేసులో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతోంది ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి దగ్గర గతంలో గన్‌మెన్‌గా పని చేసిన మదన్‌ను దారుణంగా హింసించారని తెలిపారాయన. మంగళవారం ఉదయం తాడేపల్లిలో మనోహర్ మీడియాతో మాట్లాడుతూ..
‘‘లిక్కర్ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకు సిట్ అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చెవిరెడ్డి పేరు చెప్పాలంటూ ఆయన మాజీ గన్‌మ్యాన్, హెడ్ కానిస్టేబుల్ అయిన మదన్‌ని చిత్రహింసలు పెట్టారు. మదన్ 10 ఏళ్లు చెవిరెడ్డి దగ్గర గన్‌మెన్‌గా పని చేశారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు మదన్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆయన మొహం మీద, వీపు మీద పిడిగుద్దులు గుద్దారు. చేతి వేళ్లు వెనక్కి విరిచి తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వాలని టార్చర్ పెట్టారు.

.. సిట్ అధికారుల హింస వల్ల మదన్ ఆరు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ చిత్రహింసల గురించి మదన్ సీఎంతో పాటు రాష్ట్ర డీజీపీకి లేఖ కూడా రాశారు. ఆ లేఖలో వివరాలన్నీ క్షుణ్ణంగా ఉన్నాయి. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లబోతున్నాం’’ అని మనోహర్‌రెడ్డి మీడియాకు వివరించారు.
నేడు హైకోర్టులో విచారణ
ఏఆర్ కానిస్టేబుల్ మదన్ తరపున వైఎస్సార్‌సీపీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. లిక్కర్ కేసులో సిట్ అధికారులు బలవంతపు వాంగ్మూల సేకరణ జరుపుతున్నారని, భౌతిక దాడులకు దిగుతున్నారని, విచాచరణ పారదర్శకంగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని మదన్ ఆ పిటిషన్‌లో అభ్యర్థించారు.
ఇదీ చదవండి: చంద్రబాబు ఇలాకాలో దారుణం