‘సాయికృష్ణ కేసులో వాస్తవాలు బయటకు రావాలి’ | Ysrcp Leader Vangaveeti Narendra Comments On Saikrishna Case | Sakshi
Sakshi News home page

‘సాయికృష్ణ కేసులో వాస్తవాలు బయటకు రావాలి’

Jun 24 2026 2:51 PM | Updated on Jun 24 2026 3:05 PM

Ysrcp Leader Vangaveeti Narendra Comments On Saikrishna Case

సాక్షి, తాడేపల్లి: సాయికృష్ణపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. అతన్ని పోలీసులు ఇబ్బంది పెట్టటానికి వేరే కారణాలు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అవన్నీ వెలుగులోకి రావాలంటే సీబిఐతోనే విచారించాలని డిమాండ్‌ చేశారు.

‘‘సాయికృష్ణపై అత్యాచారం కేసు అబద్ధం. తన మరదలు, సాయికృష్ణ ప్రేమించుకున్నారు. ఇరువైపులా కుటుంబాల్లో ఒప్పుకోకపోవటంతో పెళ్లి చేయలేదు. ఈ విషయంలో ఆ అమ్మాయిని బెదిరించి.. సాయికృష్ణపై అక్రమంగా కేసు పెట్టించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే సాయికృష్ణపై పోక్సో కేసు పెట్టారు. అది అబద్ధపు కేసని ఆ అమ్మాయే కోర్టులో చెప్పింది’’ అని వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు.

‘‘అసలు సాయికృష్ణ మీద పోలీసులు ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏంటి?. సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ వాళ్లు తీసుకువచ్చి విచారించాల్సినంత కేసు ఏం ఉంది?. అతన్ని పోలీసు శాఖ ఎందుకు వాడుకుందో తెలియాలి. సీపీ, డీజీపీ, హోంమంత్రి నోరు తెరిచి వాస్తవాలను వెల్లడించాలి. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారంటే వాళ్లు ఎంతపెద్ద క్రిమినల్స్?. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వెంకట్, రాజులను బెదిరించి సీసీ కెమెరా పుటేజీని డిలీట్ చేయించారు. సాయికృష్ణ కేసులో వాస్తవాలన్నీ బయటకు రావాలంటే సీబీఐతోనే విచారించాలి’’ అని  వంగవీటి నరేంద్ర డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement