
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పాసై, ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం వారిని వేధింపులకు గురిచేస్తోందని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాసలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైద్య విద్యను పూర్తి చేసి.. నిబంధనలు ప్రకారం ఇంటర్నషిప్ కూడా కంప్లీట్ చేసి.. దాదాపు ఏడాది కావస్తున్నా వైద్యులుగా సేవలందించేందుకు సిద్దంగా ఉన్న వారికి పీఆర్ చేయకపోవడాన్ని సీదిరి అప్పలరాజు తప్పు పట్టారు.
రాష్ట్రంలో తగినన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు లేకపోవడం.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య ఖరీదు కావడం వల్లే చాలా మంది విదేశాల్లో మెడిసిన్ విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. అనంతరం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష కూడా క్లియర్ చేసి... ఆ తర్వాత ఏడాది ఇంటర్నెషిప్ పూర్తి చేసుకున్నా వారికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. కోవిడ్ టైంలో ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యారన్న సాకుతో రిజిష్ట్రేషన్ నిరాకరస్తున్నారని... మన దేశంతో పాటు ప్రపంచమంతా కోవిడ్ టైంలో ఆన్ లైన్ క్లాసులకే హాజరయ్యారన్న విషయాన్ని గుర్తు చేశారు.
తమకు న్యాయం చేయాలని వారు ధర్నాకు దిగితే... వారి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారించాల్సిన ప్రభుత్వం... నేరస్ధులు తరహాలో వారిని అత్యంత దుర్మార్గంగా కొట్టి పోలీసు స్టేషన్‌కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని.. హక్కులు కోసం ఎవరూ గొంతెత్తి మాట్లేడే వీలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్స్ డే రోజునే తమ న్యాయపరమైన డిమాండ్ కోసం ఆందోళన చేస్తుంటే వైద్య విద్యార్థులను కూడా జైల్లో పెట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.
తెలంగాణాలో జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ పెంచాలని ఉదయం ఆందోళనకు దిగితే సాయంత్రానికి అక్కడ ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించిందని గుర్తు చేసారు. గతంలో కూడా చంద్రబాబు ఎంబీబీఎస్ పూర్తైన తర్వాత ఐదేళ్ల గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు చేయాలని నిబంధన పెట్టారని.. చంద్రబాబుకు వైద్య విద్యార్ధులను వేధించడం అలవాటేనని మండిపడ్డారు.
తన నాలుగు దఫాలు పాలనలో చంద్రబాబు కనీసం ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేదని తేల్చి చెప్పారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు కేవలం తన ఐదేళ్ల పాలనలోనే నాలుగు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో నిర్మించి రాష్ట్రానికి గొప్ప మేలు చేశారని కొనియాడారు. వైయస్ రాజశేఖరరెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అప్పుడు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రయత్నం చేయలేదని.. కేవలం ప్రయివేటు మెడికల్ కాలేజీల నిర్మాణానికే మొగ్గు చూపారని స్పష్టం చేశారు.
పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసి వాటి పనులు మొదలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని డాక్టర్ అప్పలరాజు తేల్చి చెప్పారు. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023-24 లో ప్రారంభించి 750 సీట్లు అదనంగా సాధించారన్నారు.
చంద్రబాబు సీఏం అయ్యేనాటికి 2024-25 సంవత్సరం నాటికి మరో ఐదు కాలేజీల్లో అరవై శాతం పనులు పూర్తయితే... వాటిని మొదలు పెట్టకుండా... మాకు మెడికల్ సీట్లు వద్దంటూ లెటర్ పెట్టిన దుర్మార్గమైన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలను నిలిపివేయడం దారుణమని.. 17 మెడికల్ కాలేజీల కోసం రూ. 8,500 కోట్లు అవసరం కాగా.. జగన్మోహన్ రెడ్డి హయాంలో సుమారుగా రూ. 2300 కోట్లు ఖర్చు పెడితే.. మరో రూ. 6.500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణమన్నారు. రాజధాని నిర్మాణం కోసం రూ. 80 వేల కోట్లు అప్పు చేస్తున్న ప్రభుత్వం.. పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించడానికి ముందుకు రాకపోవడం... వైద్య రంగం పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
పక్క రాష్ట్రాల్లో వీరితో పాటు చదువుకున్న వైద్య విద్యార్దులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఏపీలో ఎందుకు చేయడం లేదని నిలదీశారు. న్యాయం చేయమని అడిగితే వైద్యులపైకూడా పోలీసులతో దాడులు చేయించడం అత్యంత విచారకరమన్నారు. ప్రభుత్వం కచ్చితంగా తన నిర్ణయాన్ని మార్చుకోని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే వైద్యరంగంలో సమూలు మార్పులు వచ్చి ఉండేవని.. కూటమి పాలనలో ఆరోగ్యశ్రీ సహా వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యమైందని తేల్చి చెప్పారు.
ఈ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని కూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లే పరిస్ధితి లేదన్నారు. రూ.లక్షా అరవై ఐదువేల కోట్లు అప్పు చేసి ఎవరి సంక్షేమం చేశారని నిలదీశారు. తక్షణమే వైద్య విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించడంతోపాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.