
సాక్షి, తాడేపల్లి: ఏపీలో యథేచ్చగా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని... చివరికి డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను కూడా అరెస్టు చేశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జత్వానీ అనే మహిళతో అక్రమ ఫిర్యాదు చేయించి పీఎస్ఆర్‌ని అరెస్టు చేశారు. ఏపీపీఎస్సీలో అక్రమాలు అంటూ మరొక కేసు ఆయనపై పెట్టారు. డిజిటల్ మూల్యాంకనం చేయమని హైకోర్టు చెప్తేనే ఏపీపీఎస్సీ నిర్వహించింది. కానీ అక్రమంగా చేశారంటూ కేసులు పెట్టారు’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు.
‘‘వాస్తవాలన్నీ త్వరలోనే బయట పడతాయి. చంద్రబాబు 21 నోటిఫికేషన్లను సంబంధించి ఏమాత్రం ముందుకు తీసుకుపోవటం లేదు. ఇటీవల గ్రూపు-2 లో ఎన్ని అక్రమాలు చేశారో జనం చూశారు. వైఎస్ జగన్ హయాంలో ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా అన్ని నియామకాలు గొప్పగా జరిగాయంటూ కేంద్రమే మెచ్చుకుంది. చంద్రబాబు 1995లో సీఎం అవగానే టెన్త్ పేపర్లు లీక్ అయ్యాయి. 1997లో ఇంటర్ పరీక్ష పేపర్లు లీకే చేశారు. 2017 లో కూడా నారాయణ విద్యాసంస్థల కోసం ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగాయి. ఆ విషయాన్ని ఈనాడు పత్రికలో కూడా వార్తలు వచ్చాయి.
..పేపర్ల లీకేజీలో అప్పటి మంత్రి నారాయణ, గంటా శ్రీనివాసరావు పాత్ర ఉంది. అయినప్పటికీ వారిని చంద్రబాబు ఎందుకు అరెస్టు చేయలేదు?. 2022లో నారాయణ సంస్థల వారు ప్రశ్నాపత్రాల లీక్ చేయాలని చూస్తే జగన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అంత పకడ్బందీగా జగన్ పాలనలో పరీక్షలను నిర్వహించారు. చంద్రబాబు హయాంలో మూడు లీకులు, ఆరు అక్రమాలు ఉంటాయి. చివరికి హాఫ్ ఇయర్లీ పరీక్షా పత్రాలు కూడా చంద్రబాబు హయాంలో లీకయ్యాయి
జగన్ హయాంలో ఆరి నెలలోనే లక్షా యాభై వేల ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి అక్రమాలు లేకుండా నియామకాలు చేశారు. జగన్‌ని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు వ్యవహరించాలి. ఇకనైనా ఆరోపణలను కట్టిపెట్టి కక్షసాధింపు రాజకీయాలను మానుకోవాలి’’ అని నాగార్జున యాదవ్ హితవు పలికారు.
