
సాక్షి, నెల్లూరు: ఏపీలో అధికార కూటమి పార్టీ నేతలు చెప్పినట్లు వింటున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. బెదిరిది లేదు.. వెనక్కి తగ్గిదిలేదని స్పష్టం చేశారు. మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి కాకాణి.. తనపై నమోదైన అక్రమ కేసులపై స్పందించారు. ఈ క్రమంలో నెల్లూరులో కాకాణి మీడియాతో మాట్లాడుతూ..‘మైనింగ్ అధికారులు ఇచ్చిన నివేదికలో తన ప్రమేయం ఉందని ఎక్కడా ప్రస్తావించలేదు. సోమిరెడ్డి ఫిర్యాదు చేశారని.. నాపై పొదలకూరు పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు. 16 విచారణలు జరుగుతున్నాయి. ఎనిమిది అక్రమ కేసులు నాపై నమోదు చేశారు. రుస్తుం మైన్స్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి వారి ద్వారా నా పేరు చెప్పించే ప్రయత్నం చేశారు. నా ప్రమేయం లేదని తెలిసినా.. నాపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు.
అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వింటున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. కావాలనే క్వార్జ్ అక్రమ రవాణాలో కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో మరిన్ని పోరాటాలు చేస్తాము తప్పా.. రాజీ పడే ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాను కాబట్టే ప్రభుత్వానికి నేను టార్గెట్ అయ్యాను. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేది లేదు.. వెనక్కి తగ్గేది లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
