
సాక్షి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏపీకి అన్యాయం జరుగుతుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ప్రత్యేక హోదా ఎగిరిపోయింది. ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అంటూ చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారు. పోలవరాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు.
‘‘పోలవరం ప్రాజెక్టు 47.72ను ఎత్తు నుంచి 41.15 ఎత్తుకు తగ్గించారు. చంద్రబాబు దీనికి ఒప్పుకున్నాడు. కేంద్ర జల శక్తి వార్షిక నివేదికలో కూడా ఇదే పేర్కొంది. పోలవరాన్ని41.15 తగ్గించి కేంద్రం 25 వేల నుంచి 30 వేల కోట్లు ఎగ్గొడుతుంది. లోకేష్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి చంద్రబాబు దీనికి ఒప్పుకున్నాడు. ఇది దారుణమైన అంశం. వైఎస్సార్‌సీపీపై విరుచుకుపడి కథనాలు రాసే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ కథనాన్ని ఎందుకు రాయరు?’’ అంటూ అంబటి ప్రశ్నించారు.

‘‘పోలవరం ఎత్తును తగ్గించారని నేను చెబుతున్న మాటలు తప్పయితే కేంద్ర మంత్రులు గాని రాష్ట్ర మంత్రులు చెప్పాలి. పోలవరం ఎత్తు తగ్గిస్తే మంత్రులు ఎందుకు మాట్లాడలేదు. షర్మిల చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో షర్మిల సింహభాగం పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు కలిసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరి, చంద్రబాబుతో కలిసి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతుంది’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.
‘‘ఆస్తి తగాదాలుంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలి. చంద్రబాబుకి చెల్లెలు ఉన్నారు. వాళ్లకి హెరిటేజ్‌లో భాగం ఇవ్వమంటే ఇస్తాడా?. వైఎస్ జగన్‌ను దెబ్బతీయడానికి షర్మిలతో మాట్లాడిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.