
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఆమెతో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్.. బీసీ మహిళపై జరిగిన పాశవిక దాడిని ఆయన ఖండించారు. టీడీపీ, జనసేన మూకలు దాడి చేసిన విషయం పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.
ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలు భయంతో వణికిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా? అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, ఆటవిక పాలన సాగుతోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. హారిక ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు.
బీసీ మహిళ, జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడికి పాల్పడ్డారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి అమానుషం అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ, జనసేన గూండాలు పట్టపగలే విచక్షణారహితంగా దాడికి పాల్పడడం దారుణమన్నారు. కూటమి పార్టీ కార్యకర్తలు ఉన్మాదంతో దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళా ప్రజా ప్రతినిధికే రక్షణ లేదు. ఇక సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం ఏం రక్షణ ఇస్తుంది.?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు.
..ఒక జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం సిగ్గు చేటు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు దీనికేం సమాధానం చెబుతారు?. మహిళా హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదు?. ఈ అకృత్యాలకు కచ్చితంగా ప్రజా కోర్టులో తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది’’ అని వరుదు కళ్యాణి హెచ్చరించారు.