‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌.. అజిత్‌ను కలిసిన ఉద్ధవ్‌

Uddhav Thackeray Meets Ajit Pawar A Day After Rival Alliance Talks - Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్సీపీలో చీలిక తర్వాత మహా పాలిటిక్స్‌లో ‘పవార్‌’ పేరే జోరుగా వినిపిస్తోంది. తాజాగా ఎన్సీపీ తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ను శివసేన నేత (యూబీటీ) ఉద్ధవ్‌ ఠాక్రే కలిశారు. బుధవారం ముంబైలో జరిగిన ఈ భేటీలో శివసేన నేత ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు.

కాగా అజిత్‌ పవార్‌ బీజేపీ, శివసేన (షిండే) ప్రభుత్వంలో చేరిన తర్వాత వీరిరువురు కలవడం ఇదే తొలిసారి. అయితే అజిత్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే గతంలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సంగతి విదితమే. శివసేనలో చీలిక ఏర్పడి ఎంవీఏ ప్రభుత్వం కూలిపోవడానికి ముందు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవార్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 

అజిత్‌ పనితీరు తెలుసు: ఉద్ధవ్‌
అజిత్‌తో భేటీ అనంతరం ఉద్ధవ్‌ మీడియాతో మాట్లాడారు.. అజిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర ధృతరాష్ట్రుడిలా గుడ్డిది కాదని, ఛత్రపతి శివాజీ మహారాజా నడియాడిన రాష్ట్రమని తెలిపారు. అజిత్‌ రాష్ట్ర ప్రజలు, రైతుల కోసం మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో అజిత్‌తో కలిసి పనిచేశాను కాబట్టి అతని పని తీరు తెలుసని చెప్పారు.  
చదవండి: మేం వాళ్లకు అంటరానివాళ్లమేమో!: ఎంఐఎం

విపక్షాల భేటీ మరుసటి రోజే..
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే బెంగుళూరులో రెండు రోజులపాటు జరిగిన ప్రతిపక్ష పార్టీల కీలక భేటీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇది జరిగిన  మరుసటి రోజే అజిత్‌తో సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు అజిత్‌ పవార్‌ సైతం ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో  సమావేశమయ్యారు. ఎన్డీయేలో చేరాలని శరద్‌ను కోరారు.

కాగా అజిత్‌ తన బాబాయిని  24 గంటల వ్యవధిలో రెండుసార్లు (ఆది, సోమవారం) కలిశారు. అజిత్‌ తన వర్గం నేతలతో కలిసి ముంబయిలోని శరద్‌ పవార్‌ నివాసానికి చేరుకొని, పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై ఆయనతో చర్చించారు. అయితే, తమ విజ్ఞప్తిని విన్న శరద్‌ పవార్‌.. మౌనంగా ఉన్నారని, ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ వెల్లడించారు.
చదవండి: షాకింగ్‌ వీడియో.. మహిళా పైలట్‌ను జుట్టు పట్టుకొని లాక్కొచ్చి..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top