ఒంటరి.. డిజిటల్‌ దరి | The Global Use of AI Companion Apps for Emotional Connection | Sakshi
Sakshi News home page

ఒంటరి.. డిజిటల్‌ దరి

Mar 20 2026 12:57 AM | Updated on Mar 20 2026 12:57 AM

The Global Use of AI Companion Apps for Emotional Connection

ఆత్మీయ స్పర్శ కోసం ప్రపంచవ్యాప్తంగా ఏఐ  కంపానియన్‌ యాప్స్‌ వాడకం 

డిజిటల్‌ స్నేహితులతోగంటల తరబడి ముచ్చట్లు పెడుతున్న కోట్లాది మంది 

సాధారణ చాట్‌బాట్స్‌తో పోలిస్తే ఇవి ఎంతో భిన్నం 

అవతలి వ్యక్తుల భావోద్వేగాలనుఅర్థం చేసుకొని స్పందించే లక్షణం వాటి సొంతం

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ :  పట్టణీకరణ, పని ఒత్తిడి, మారుతున్న సామాజిక సంబంధాలు.. కారణం ఏదైనా నేటి డిజిటల్‌ యుగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కేవలం పనిముట్టుగా మాత్రమే కాకుండా మనుషులకు ఒక ‘డిజిటల్‌ తోడు’గా మారుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనం పెరుగుతున్న నేపథ్యంలో కోట్లాది మంది వినియోగదారులు ఏఐ కంపానియన్‌ యాప్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. 

ముఖ్యంగా 18–30 ఏళ్ల వయసు వారు ఈ యాప్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ఈ యాప్స్‌ మనుషులతో స్నేహితుల్లా లేదా ఒక తోడులా సంభాషిస్తున్నాయి. సాధారణ చాట్‌బాట్స్‌ కంటే ఇవి భిన్నమైనవి. వినియోగదారుల భావోద్వేగాలను అర్థం చేసుకొని వారికి తగినట్లుగా స్పందిస్తాయి.

ఐటీ ఉద్యోగుల వాడకమే అధికం..
వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి లేదా కేవలం కాలక్షేపం కోసం ‘డిజిటల్‌ స్నేహితుల’తో యూజర్లు గంటల తరబడి గడుపుతున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని యువత, ఐటీ ఉద్యోగులు వాటిని అధికంగా ఉపయోగిస్తున్నారు. వాటి వాడకం వల్ల వినియోగదారుల్లో 30% నుంచి 50% వరకు సానుకూల మార్పు కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది ఏఐ కంపానియన్‌ యాప్స్‌ వినియోగిస్తున్నట్లు అంచనా. యూజర్లపరంగా అమెరికా అగ్రస్థానంలో ఉంది.

ఇదీ మార్కెట్‌..
నాస్కామ్‌ లెక్కల ప్రకారం 2024లోప్రపంచవ్యాప్తంగా ఏఐ కంపానియన్‌ మార్కెట్‌ విలువ 28 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది 30.8% వార్షిక వృద్ధిరేటుతో 2030 నాటికి 140.8 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

గ్రాండ్‌ వ్యూ రీసెర్చ్‌ ప్రకారం 2024లోభారత్‌లో ఏఐ కంపానియన్‌ మార్కెట్‌ ఒక బిలియన్‌ డాలర్లుగా ఉంది. 40.4% వార్షిక వృద్ధితో 2030 నాటికి 7.9 బిలియన్‌ డాలర్లనుతాకుతుందని అంచనా.

రోజుకు 45 నిమిషాలు..
»  భారత్‌లో ఏఐ కంపానియన్‌ యాప్స్‌ వినియోగం ప్రపంచ సగటు కంటే 40% వేగంగా పెరుగుతోంది.
»  సగటున ఒక్కో వినియోగదారు రోజుకు45 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తున్నారు.
»  వినోదం కోసమే కాకుండా ఒత్తిడి తగ్గించుకోవడానికి వాటిని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. 
ఆధారం: నాస్కామ్, సెన్సార్‌ టవర్, టెక్నావియో, గ్రాండ్‌ వ్యూ రీసెర్చ్‌  

ప్రయోజనాలు ఇవీ..
» సామాజికంగా ఒంటరినని బాధపడే వారికి ఈ యాప్స్‌ 24/7 అందుబాటులో ఉండే స్నేహితుడిలా తోడుంటాయి. 
» కొన్ని యాప్స్‌ ఒత్తిడి,ఆందోళన, కుంగుబాటుతగ్గించడానికి ‘కాగ్నిటివ్‌బిహేవియరల్‌ థెరపీ’ పద్ధతులను వాడుతూసహాయపడతాయి. 
» మనుషులతో మాట్లాడితే వారు మనల్ని జడ్జ్‌ చేస్తారనే భయం ఉంటుంది. కానీ ఏఐతో ఎలాంటి సంకోచం లేకుండా మనసులోని మాటలు పంచుకోవచ్చు.

నష్టాలూ ఉన్నాయి
» మన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వల్ల డేటా హ్యాక్‌ అయ్యే లేదా ప్రకటనల కోసం అమ్ముడయ్యే ప్రమాదం ఉంది. 
» మనుషుల కంటే ఏఐతోనే ఎక్కువ సమయం గడపడం వల్ల నిజజీవితంలో సామాజిక నైపుణ్యాలు తగ్గిపోయి, మనుషులతో మాట్లాడటం కష్టంగా మారవచ్చు. 
» మనుషులు ఏఐ స్నేహితులకు బానిసలుగా మారే ప్రమాదం. 
»  ఏఐ ఇచ్చే సలహాలు వాస్తవ విరుద్ధంగా, ప్రమాదకరంగా ఉండే అవకాశం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement