Five State Election Battle: ఉత్తరాది రాష్ట్రాల్లో హోరాహోరీనే..!

Tug Of War Between Congress And BJP In North States - Sakshi

మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉందంటున్నారు విశ్లేషకులు. మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని సర్వేలు కూడా చెబుతున్నాయి. రాజస్థాన్ లో మాత్రం కాంగ్రెస్-బీజేపీల మధ్య హోరా హోరీ పోరు ఉంటుందని ప్రస్తుతం బీజేపీకి కొద్ది పాటి మొగ్గు ఉందని అంటున్నారు. అయితే రాజస్థాన్‌లో కూడా తామే గెలుస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఛత్తీస్ ఘడ్ లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమంటున్నారు. అయితే ఓటరు నిర్ణయం ఏంటనేది తెలిసేది మాత్రం డిసెంబరు మూడునే. అప్పటి వరకు ఫలానావారే గెలుస్తారని చెప్పలేం అంటున్నారు రాజకీయ పండితులు.

సెమీఫైనల్స్ గా   అందరూ అభివర్ణిస్తోన్న  ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ అయిదు రాష్ట్రాల్లోనూ మెజారిటీ రాష్ట్రాల్లో ఎవరు సత్తా చాటితే వారికి వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉండచ్చని ఒక వాదన. అయితే అందులో శాస్త్రీయత ఉందని చెప్పలేం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

మధ్య ప్రదేశ్‌లో  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది.  గత ఎన్నికల్లో  ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బొటా బొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని అలిగిన జ్యోతిరాదిత్య సింధియా కొంత కాలం తర్వాత బీజేపీతో చేతులు కలిపారు. దాంతో  కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది . సింధియా మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. అయితే ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోందని అంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి రావడం..ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వాన్ని కూల్చివేయడంతో  కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఒకరకమైన సానుభూతి కూడా ఉందంటున్నారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలుపుకంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ప్రీపోల్ సర్వేలు అంటున్నాయి. కాంగ్రెస్ అధినేత  రాహుల్ గాంధీ అయితూ ఎంపీలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రాజస్థాన్‌లో  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో   కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మధ్య ప్రదేశ్ తరహాలోనే ముఖ్యమంత్రి పదవిని ఆశించిన సచిన్ పైలట్‌ను కాదని సీనియర్ అయిన అశోక్ గెహ్లాట్ కు  కిరీటం  పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. దాంతో పైలట్ అలిగారు. ఎంపీలో సింధియా తరహాలోనే  రాజస్థాన్ లో పైలట్ కూడా బీజేపీతో  టై అప్లోకి వెళ్లారు . ఆయన పార్టీ మారే అవకాశాలున్నాయని ఉప్పందడంతోనే రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ  పైలట్‌ను  బుజ్జగించి  పార్టీ మారకుండా ఆపుకోగలిగారు. అయితే ఆతర్వాత గెహ్లాట్  అదే పనిగా సచిన్ పైలట్ ను వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైలట్ వర్గీయులకు  కీలక పదవులు ఇవ్వకుండా  అవమానించారు. దీనిపై అలిగిన పైలట్ ప్రభుత్వంపైనే బాహాటంగా విమర్శలు చేయడంతో ఈ మధ్యనే రాహుల్ గాంధీ  పైలట్ తో భేటీ అయ్యి ఆయన్ను దారికి తెచ్చుకున్నారు. పార్టీలో కీలక ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇవ్వడంతో పైలట్ తగ్గారు. ఈ ఇద్దరి మధ్య గొడవలతో కాంగ్రెస్ పార్టీ  ఈ ఎన్నికల్లో  దెబ్బతింటుందేమోనని  కాంగ్రెస్ నాయకత్వం కంగారు పడింది.

అయితే  గెహ్లాట్ పాలనలో  అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని..వాటి పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని  సర్వేల్లో తేలింది. ప్రీపోల్ సర్వేల్లో బీజేపీకి స్వల్ప మొగ్గు ఉందని తేలింది. అయితే గెహ్లాట్  పాలనపై మాత్రం మరీ అంత ఎక్కువ వ్యతిరేకత ఏమీ లేదని కూడా అంటున్నారు. కాంగ్రెస్-బీజేపీలు రెండింటిలోనూ  నేతల మధ్య ఆధిపత్య పోరులు ఉన్నాయి.వాటి ప్రభావం ఆయా పార్టీలపై ఏ విధంగా ఉంటుదో ఇప్పుడే చెప్పలేం అంటున్నారు పరిశీలకులు. రాజస్థాన్ లో మళ్లీ అధికారంలోకి వస్తామని  కాంగ్రెస్ చాలా ధీమా వ్యక్తం చేస్తోంది.

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీయే ముందంజలో ఉందంటున్నారు. గిరిజనులు  బీజేపీకి దూరం జరిగి కాంగ్రెస్ వైపే నిలిచారని అంటున్నారు. మూడు  ఉత్తరాది రాష్ట్రాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రాజస్థాన్‌లో  బీజేపీకి  కాంగ్రెస్ చాలా గట్టి పోటీనే ఇస్తోంది.  కర్నాటక , హిమాచల ప్రదేశ్ ఎన్నికల విజయాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను రీ డిజైన్ చేసుకుంది.  కర్నాటక వ్యూహాన్నే  ఈ అయిదు రాష్ట్రాల్లోనూ అమలు చేస్తోంది.  ఎన్నికల హామీల విషయంలోనూ  ఒకేరకమైన గ్యారంటీలు ఇస్తోంది. సక్సెస్ ఫుల్ ఫార్ములానే అన్ని చోట్లా అమలు చేయడం మంచిదన్నది పార్టీ వ్యూహకర్తల ఆలోచనగా తెలుస్తోంది.

రాజస్థాన్లో అవినీతి ఆరోపణలతో పాటు మహిళలపై  నేరాలు, అకృత్యాలు దారుణంగా పెరిగిపోతోన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని. శాంతిభద్రతలు ఘోరంగా క్షీణించాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో వీటినే అస్త్రాలుగా మలుచుకుంటోంది. బీజేపీ తరపున మోదీ, అమిత్ షాలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తోంటే  కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు  కాలికి చక్రాలు కట్టుకుని తిరిగేస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top