మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి 

Telangana: Sitaram Yechury Criticized On Narendra Modi Government - Sakshi

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపు 

కరోనా నియంత్రణపై కేంద్రం చేతులెత్తేసింది 

సీబీఐ, ఈడీలను నచ్చినట్టు వాడుకుంటోందని ఫైర్‌ 

రాష్ట్రంలో బీజేపీ మా ప్రధాన శత్రువు: తమ్మినేని 

సీపీఎం రాష్ట్ర మహాసభలు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌/రంగారెడ్డి జిల్లా: దేశాన్ని లూటీ చేస్తున్న కేంద్రంలోని మోదీ సర్కారును గద్దె దించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. కరోనాను నియంత్రించడంలో కేంద్రం చేతులెత్తేసిందని, అంతా రాష్ట్రాలపైకి నెట్టిందని ఆరోపించారు. గత డిసెంబర్‌ 31 నాటికి దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్‌ వేయిస్తామన్నారని, అది ఇంకా నెరవేరలేదని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా శనివారం జరిగిన ఆన్‌లైన్‌ బహిరంగ సభలో ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్‌ పద్ధతిలో మాట్లాడారు.

‘ఆర్థిక రంగంలో పెద్ద సంక్షోభం వచ్చింది. ధరలు పెరుగుతున్నాయి. సంపద లూటీ అవుతోంది’అని ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని అమ్ముకోండి.. పొలిటికల్‌ ఫండ్‌గా బీజేపీకి కేటాయించండని చెబుతున్నారని విమర్శించారు. దేశంలో 112 మంది మహా కోటీశ్వరులు ఉన్నారని, వారి చేతుల్లో ప్రజల వద్ద ఉన్న సంపదలో 55 శాతం ఉందని చెప్పారు.

పార్లమెంటులో చర్చలే జరగవు 
రాజ్యాంగంలోని కీలక స్తంభాలను ధ్వంసం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాసి కేంద్రమే తన చేతుల్లోకి తీసుకుంటోందని ఏచూరి మండిపడ్డారు. ‘12 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్‌ చేశారు. పార్లమెంటులో ఎలాంటి చర్చలు జరగవు. పార్లమెంటును రబ్బర్‌ స్టాంప్‌లా వాడుకుంటున్నారు. సీబీఐ, ఈడీలను తన రాజకీయ ఏజెన్సీలుగా బీజేపీ ఉపయోగించుకుంటోంది. తనకు లొంగని ప్రతిపక్షనాయకుల మీద కేసులు పెడుతూ హింసిస్తోంది’అని విమర్శించారు.

ఎన్నికల్లో ఏ పార్టీనైనా నెగ్గనీయండి.. కానీ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని కేంద్ర మంత్రి అమిత్‌ షా అనడంపై మండిపడ్డారు. పార్టీ పాత వైభవాన్ని మళ్లీ తీసుకురావాలని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రైతులు, మహిళల కోసం ఎర్రజెండా పోరాడుతుందని పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ అన్నారు. రాష్ట్రం విడిపోయాక బంగారు తెలంగాణ తెస్తామని పాలకులు ఆశ చూపారని, కానీ ఆశలు అడియాసలయ్యాయని మరో పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. దొరల తెలంగాణ కాకుండా ప్రజా తెలంగాణ రావాలన్నారు.

బీజేపీ విషసర్పంలా ఎదుగుతోంది: తమ్మినేని 
రాష్ట్రంలో బీజేపీ విషసర్పంలా ఎదుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వార్డు స్థాయిలోకి కూడా వెళ్లిందని, విద్వేషాలను రెచ్చగొడుతోందని, మతవిద్వేషాలను పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బీజేపీ తమ ప్రధాన శత్రువని ప్రకటించారు. రాష్ట్ర మహాసభల్లో కూడా బీజేపీని అడ్డుకోవడమెలానో చర్చిస్తామన్నారు. విభజన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని కేసీఆర్‌ కోరడంలేదని విమర్శించారు.

కేంద్రంపై ఒక్కనాడైనా ఆయన పోరాటం చేస్తున్నారా అని నిలదీశారు. బీజేపీని రాజకీయ బేరసారాలకు, తన ప్రయోజనాలకు కేసీఆర్‌ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను నమ్మలేకపోతున్నామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ సహా ఎవరు వచ్చినా కలిసి పోరాడతామని, దీనర్థం వాళ్లతో ఎన్నికల పొత్తులుంటాయని కాదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తే ఊరుకోబోమన్నారు. రాబోయే కాలంలో వామపక్షవాదులతో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top