కవితకు నోటీసులిస్తే రాష్ట్రం ఉద్యమించాలా? 

Telangana: BJP Chief Bandi Sanjay Slams TRS Leaders - Sakshi

నర్సాపూర్‌ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

తెలంగాణ సెంటిమెంట్‌ రగిలించేందుకు టీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోంది 

అవినీతి కేసుల్లో కేసీఆర్‌ కుటుంబం కూరుకుపోయింది 

సీఎం ఫ్యామిలీ జైలుకు పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు 

నిర్మల్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీఎం కేసీఆర్‌ బిడ్డ కవితకు ఈడీ నోటీసులిస్తే తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. లిక్కర్‌ దందాలో అడ్డంగా దొరికిన కేసీఆర్‌ బిడ్డ కోసం తెలంగాణ ప్రజలు ఎందుకు ఉద్యమించాలని ఆయన ప్రశ్నించారు. లిక్కర్, డ్రగ్స్, క్యాసినో, అవినీతి కేసుల్లో కేసీఆర్‌ కుటుంబం కూరుకుపోయిందన్నారు.

అందుకే ఇప్పుడు ప్రజలు కేసీఆర్‌ కుటుంబం జైలుకు పోవాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజాసంగ్రామ పాదయాత్ర ఐదో రోజు శుక్రవారం నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం బామ్ని (కె), నందన్, నర్సాపూర్‌ (జి), రాంపూర్‌ గ్రామాల మీదుగా సాగింది. నందన్‌లో రచ్చబండ పెట్టి సమస్యలు తెలుసుకున్నారు. గిరిజన మహిళలు, బీడీ కార్మికులతో మాట్లాడారు. నర్సాపూర్‌ (జి)లో రాత్రి నిర్వహించిన సభలో కేసీఆర్‌ కుటుంబంపై బండి విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ పంజాబ్‌ వెళ్లి అక్కడి రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయ్యాయని, సీఎం తీరును చూసి దేశం నవ్వుకుంటోందని ఎద్దేవా చేశారు. 

ట్రిపుల్‌ ఐటీ మూసివేతకు కేసీఆర్‌ కుట్ర.. 
బాసర ట్రిపుల్‌ ఐటీ మూసివేతకు సీఎం కేసీఆర్‌ కుట్రపన్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. అందులో భాగంగానే విద్యార్థులకు సరైన తిండి, కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన ఆరోపించారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన విద్యార్థులను పొమ్మనలేక పొగబెడుతున్నారని మండిపడ్డారు. తమ చుట్టాలకే సీఎం కాంట్రాక్టులు ఇచ్చారని... అందుకే అక్కడ ఏం జరిగినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ స్వయంగా వచ్చి బాసర ట్రిపుల్‌ ఐటీ సమస్యలు పరిష్కరించాలని బండి డిమాండ్‌ చేశారు.  

మంత్రి, పోలీసులపైనే కేసులు పెట్టిస్తా.. 
నిర్మల్‌ నియోజకవర్గంలోని నర్సాపూర్‌లో దళితబంధు అడిగిన పాపానికి మహిళలపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు దళిత మహిళలపై దాడిచేసి కేసులు పెట్టిన పోలీసులపై అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తానని బండి సంజయ్‌ తెలిపారు. ఈ విషయాన్ని ఎంపీ సోయం బాపురావు ద్వారా ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఈ సందర్భంగా బాధిత మహిళ బర్కుంట చిలుకతో సంజయ్‌ మాట్లాడించగా వచ్చే ఎన్నికల్లో మంత్రి ఇంద్రకరణరెడ్డిపై పోటీ చేస్తానని ఆమె పేర్కొంది. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ సోయం బాపురావు, పాదయాత్ర ప్రముఖ్‌ గంగిడి మనోహర్‌రెడ్డి, సహప్రముఖ్‌ తూళ్ల వీరేందర్‌గౌడ్, పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top