కచ్చితంగా ‘పచ్చ’ కుట్రే! | Sakshi
Sakshi News home page

కచ్చితంగా ‘పచ్చ’ కుట్రే!

Published Mon, May 20 2024 3:37 AM

టీడీపీ గుండాలు చేసిన విధ్వంసకాండను సిట్‌ అధికారులకు వివరిస్తూ, వారి బెదిరింపుల నుంచి తమను రక్షించాలంటూ వేడుకుంటున్న తిరుపతి జిల్లాలోని రామిరెడ్డిపల్లి వాసులు

ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యంగా టీడీపీ విధ్వంసకాండ

వీడియో, ఫొటో ఆధారాలతో సహా వెలుగులోకి..

టీడీపీ గూండాగిరీపై గోడు వెళ్లబోసుకున్న బాధితులు

కీలక ఆధారాలు సేకరించిన సిట్‌ అధికారులు

పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో సిట్‌ విస్తృత విచారణ

దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటన.. రికార్డుల పరిశీలన

ఈసీకి నేడు ప్రాథమిక నివేదిక సమర్పించనున్న సిట్‌

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే ఏకైక లక్ష్యంగా పోలింగ్‌ సందర్భంగా టీడీపీ విధ్వంస కాండకు బరి తెగించిందని పూర్తి ఆధారాలతో బట్టబయలైంది. వైఎస్సార్‌­సీపీకి అనుకూలంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు మహిళలు, వృద్ధులను ఓటింగ్‌కు దూరం చేసేందుకు టీడీపీ పక్కా పన్నాగంలో దాడులకు తెగబడి విధ్వంసం సృష్టించిందని స్పష్టమైంది. అందుకు సంబంధించి వీడియో రికార్డింగులు, ఫొటోలతో సహా కీలక ఆధారాలను సిట్‌ సేకరించింది. 

పోలింగ్‌ సందర్భంగా రాష్ట్రంలో యథేచ్ఛగా సాగిన టీడీపీ గూండాగిరీ­పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వరుసగా రెండో రోజు ఆదివారం విచారణ నిర్వహించింది. సిట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న అదనపు డీజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలోని బృందం అనంతపురం జిల్లా తాడిపత్రితో పర్యటించగా, ఇతర బృందాలు పల్నాడు, తిరుపతి జిల్లాల్లో పర్యటించి విచారణ నిర్వహించాయి. దాడులు, దౌర్జన్యాలతో భీతిల్లిన ప్రాంతాలను పరిశీలించాయి. 

పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలను పరిశీలించడంతోపాటు బాధితుల అభిప్రాయాలు తెలుసుకున్నాయి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ ఎంత పక్కాగా పన్నాగాన్ని అమలు చేసిందన్న దానిపై సిట్‌ అధికారులు ఓ అంచనాకు వచ్చినట్టు సమా­చారం. దాడులను అరికట్టడంలో పోలీసుల వైఫ­ల్యంపై కూడా సిట్‌ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చి­నట్లు తెలిసింది. బాధితులతో మాట్లాడి దాడులు ఎలా జరిగాయన్నది తెలుసుకోవడంతోపాటు కీలకమైన వీడియో, ఫొటో ఆధారాలను సేకరించారు.  

ప్రధానంగా పల్నాడు, అనంతపురం జిల్లాల్లో పోలీసులు టీడీపీకి కొమ్ము కాసినట్టు.. బాధితులు ఫోన్లు చేసినా సరే స్పందించకుండా ఉదాసీనంగా వ్యవహరించినట్టు నిగ్గు తేలింది. పోలింగ్‌ రోజున, తరువాత హింసాత్మక ఘటనలపై విచారణ ప్రక్రియను రెండు రోజుల్లో ముగించాలని ఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రెండు రోజుల విచారణ ద్వారా తాము గుర్తించిన అంశాలతో ప్రాథమిక నివేదికను సిట్‌ ఇన్‌చార్జ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఈసీకి సోమవారం సమర్పించనున్నారు. పూర్తి స్థాయి విచారణకు మరింత సమయం కావాలని ఆయన కోరే అవకాశం ఉంది.

అక్రమాలకు పాల్పడటమే లక్ష్యంగా విధ్వంసం
పక్కా పన్నాగంతో దాడులకు తెగబడి ఎన్నికల అక్రమాలకు పాల్పడాలన్నదే టీడీపీ కుట్రన్నది బట్టబయలైంది. అందుకోసమే పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు వరుస దాడులతో టీడీపీ శ్రేణులు బీభత్సం సృష్టించాయి. ప్రశాంతమైన తిరుపతి జిల్లాలో టీడీపీ ఏ విధంగా దాడులకు తెగబడిందీ వెలుగులోకి వచ్చింది. 

చిత్తూరు నుంచి రప్పించిన 2 వేల మంది రౌడీలతో చంద్రగిరి నియోజకవర్గంలోని కూచువారిపల్లెలో టీడీపీ విధ్వంసం.. రామిరెడ్డిపాలెం సర్పంచ్‌ చంద్రశేఖర్‌రెడ్డిని హత్య చేసేందుకు బరితెగించి దాడులకు పాల్పడిన కుతంత్రం.. అనంతరం తిరుపతిలోని ఎస్వీయూ, శ్రీపద్మావతి విశ్వవిద్యాలయాల ప్రాంతాల్లో దాడులు, ప్రతిదాడులకు సంబంధించిన కీలక ఆధారాలను సిట్‌ సేకరించింది. 

తిరుపతి రూరల్‌ మండలం ఎం ఆర్‌పల్లి సీఐపై టీడీపీ నేతలు రాడ్లతో దాడి చేస్తే, ఎందుకు కేసు నమోదు చేయలేదని సిట్‌ అధికారులు ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ దాడిపై కూడా కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్ట్‌ చేయాలని ఆదేశించింది. రెండు కేసుల్లో కూడా నిందితులు అందరినీ అరెస్ట్‌ చేయాలని స్పష్టం చేసింది. తాడిపత్రిలో అయితే టీడీపీ గుండాగిరికి ఏకంగా పోలీసులే దన్నుగా నిలవడం.. పోలీసులే దాడులకు పాల్పడి ఆస్తులు ధ్వంసానికి పాల్పడిన వీడియో, ఫొటో ఆధారాలను సిట్‌ సేకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

– పల్నాడు జిల్లా పమిడిపాడు గ్రామంలోని వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ బూత్‌ ఏజంట్‌ షేక్‌ మాబుపై టీడీపీ వర్గీయుల దాడి, ఉప్పలపాడులో ఇరువర్గాల దాడులు, ప్రతిదాడులు, దొండపాడు గ్రామంలో వాహనాలపై దాడి ఘటనల వెనుక టీడీపీ పక్కా పన్నాగం కూడా బట్టబయలైంది. ఈ ఘటనల వీడియోలను పరిశీలించి దాడుల తీవ్రతపై సిట్‌ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. మాచర్ల నియోజకవర్గం కారెంపూడిలో బీసీ వర్గీయులపై టీడీపీ గుండాలు యథేచ్చగా సాగించిన దాడులు, దాచేపల్లిలో టీడీపీ వర్గీయులు తెగబడి సృష్టించిన విధ్వంసకాండ వెనుక కుట్ర వెలుగులోకి వచ్చింది. పోతురాజుగుట్టలో బేడ బుడగ జంగాల కాలనీపై జరిగిన దాడిని ఆ తర్వాత 14వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు కారెంపూడిలో వరుసగా టీడీపీ రౌడీ మూకలు సాగించిన విధ్వంసాలకు సంబంధించిన వీడియో ఆధారాలను సేకరించారు.

ఇవిగో ఆధారాలు..
– పోలింగ్‌ రోజున పక్కా పన్నాగంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని బాధితులు సిట్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కేవలం ఫిర్యాదులు చేయడమే కాకుండా అందుకు సంబంధించిన వీడియో రికార్డులు, ఫొటోలను సాక్షంగా సిట్‌ అధికారులకు సమర్పించారు. చంద్రగిరి నియోజకవర్గంలో విధ్వంసకాండకు నాంది పలికిన కూచువారిపల్లిలో టీడీపీ సృష్టించిన బీభత్సం గురించి బాధితులు సిట్‌ అధికారులకు వివరించారు. 

– రామిరెడ్డిపల్లి సర్పంచ్‌ కొటాల చంద్రశేఖర్‌రెడ్డిని అంతమొందించే కుట్రలతోనే టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారని స్థానికులు సిట్‌ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కారును తగలబెట్టిన ఘటన మొదలు సర్పంచ్‌ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇల్లు, కారు ధ్వంసం చేసి, నిప్పటించడం వరకు విధ్వంసకాండ కొనసాగిన తీరును విడమరచి చెప్పారు. సర్పంచ్‌ ఇంట్లోని వృద్ధురాలిని బలవంతంగా బయటకు ఈడ్చుకొచ్చారన్నారు. ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి, విలువైన వస్తువులను దోచుకెళ్లడంతో పాటు పెట్రోల్‌ బాంబులతో ఇంటిని దగ్ధం చేశారని చెప్పారు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారని తెలిపారు. అప్పటికే సిద్ధం చేసుకున్న రాళ్లు, కర్రలతో టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడ్డారన్నారు. 

– రామిరెడ్డిపల్లి పోలింగ్‌ బూత్‌ వద్ద టీడీపీ వర్గీయులు ఎలా దాడులకు తెగబడిందీ బాధితులు వివరించారు. ఇప్పటికీ టీడీపీ నాయకుల బెదిరింపులు ఆగడం లేదని, రామిరెడ్డిపల్లిలో ఎవరినీ వదలమని.. చంపేస్తామంటూ బెదిరించారని.. మీరే రక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నారు. టీడీపీ గుండాల బెదిరింపులకు గ్రామంలో పది కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లి పోయాయని సిట్‌ అధికారుల దృష్టికి తెచ్చారు.  

– అనంతపురం జిల్లా తాడిపత్రిలోని విధ్వంసకాండపై సిట్‌ ఇన్‌చార్జ్‌ అదనపు డీజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో అధికారుల బృందానికి బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ సభ్యులు సిట్‌ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దాడులు అరికట్టడంలో పోలీసుల వైఫల్యం, బాధితులపై తిరిగి పోలీసులు దౌర్జన్యానికి దిగడం, ఆస్తులు ధ్వంసం చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటో ఆధారాలను సమర్పించారు.

– పల్నాడు జిల్లాలోని నరసారావుపేట, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో టీడీపీ హింసాకాండపై బాధితులు సిట్‌ అధికారుల వద్ద తమ ఆవేదన వెళ్లగక్కారు. మంత్రి అంబటి రాంబాబు సిట్‌ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల రోజున పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ వర్గీయుల దాడి, రూరల్‌ సీఐ రాంబాబు వ్యవహరించిన తీరుపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.

– పల్నాడు జిల్లా కారెంపూడిలో ఈ నెల 14న ఉదయం నుంచి రాత్రి వరకు టీడీపీ గుండాలు సాగించిన దౌర్జన్యకాండను బాధితులు సిట్‌ అధికారులకు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లాలోని దాచేపల్లి నగర పంచాయతీలో ఇరికేపల్లి, కేసానుపల్లి, తంగెడ, మాదినపాడు, దాచేపల్లిలో టీడీపీ రౌడీ మూకలు తెగబడి బీభత్సం సృష్టించిన తీరును బాధితులు వివరించారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement