
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల అత్యుత్సాహం ప్రదర్శించారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ గిరిజమ్మ చాంబర్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు హల్‌చల్ చేశారు. జడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, సురేంద్రబాబు, ఎంఎస్ రాజు బెదిరింపులకు దిగారు. వైఎస్ జగన్ ఫొటో తీసేయాలంటూ రాద్ధాంతం చేశారు. ఉద్యోగం తీసేయిస్తామంటూ జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదు: వెన్నపూస రవీంద్రారెడ్డి
అనంతపురంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరించారన్నారు. అనుమతి లేకుండా జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ఛాంబర్‌లోకి టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలు పట్టవా?. చంద్రబాబు ఫోటోపై ఉన్న శ్రద్ధ... సూపర్ సిక్స్ హామీల అమలులో ఎందుకు చూపలేదు?. జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదని వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు.

