సాక్షి, విజయవాడ: టీడీపీ నాయకురాలు సుధా మాధవి మరోసారి తమ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కోసం తాము ఎంతో కష్టపడామని.. తన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేనూ ఆడబిడ్డనే.. పవన్ కల్యాణ్, నారా లోకేష్ నా ఆవేదన వినండి. మాకు న్యాయం చేయకపోతే చావే శరణ్యం అని కన్నీరుపెట్టుకున్నారు.
టీడీపీ నాయకురాలు సుధా మాధవి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ కోసం చాలా కష్ట పడ్డాను. టీడీపీ నుండి టికెట్ ఇప్పిస్తామని నా నుండి ఏడు కోట్లు తీసుకున్నారు. మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మా డబ్బులతో ఆస్తులు కొన్నాడు. టీడీపీకి నేను చాలా చేశాను.. నా సేవలను గుర్తించండి. వేమన సతీష్ ఒక్కడే కార్యకర్త కాదు.. మేము కూడా కార్యకర్తలమే. నాకు అన్యాయం జరిగింది కాబట్టే నేను జై భీమ్ రావ్ పార్టీ నుండి పోటీ చేశాను. నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకున్నారు. మీ ఇంట్లో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఇలాగే స్పందిస్తారా?.
వేమన సతీష్ ఏడు కోట్లు తీసుకొన్నారు.. 43 లక్షలు చెక్ ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఆరు కోట్లు కూడా వేయాలి. మాకు అన్యాయం జరిగింది అని వీడియో తీసి పంపించాము. మా సమస్య చంద్రబాబుకి చెప్పుకుందామని విజయవాడ వస్తే పోలీసులు తీసుకొని వెళ్లారు. వేమన సతీష్‌కి మేము డబ్బులు ఇవ్వలేదని వీడియో తీయించారు. ఒక పోలీస్ అధికారి కులం పేరుతో బూతులు తిట్టారు. మా బిడ్డలు వాళ్ళ కస్టడీలో ఉన్నారని నమ్మించారు.. అలాగే భయపెట్టి వీడియో తీయించారు. మేము ఎన్ని ఆస్తులు అమ్ముకున్నది విచారణ చేసి న్యాయం చేయాలి. మేము ఇచ్చిన డబ్బులతో కొత్త ఇల్లు కొన్నారు. ఎలక్షన్ సమయంలో డబ్బులు ఎలా వచ్చాయి.
రాజేష్ మహాసేన , యూట్యూబ్‌లో మాట్లాడే వాళ్ళు మాకు న్యాయం చేపించండి. జడ శ్రావణ్ కోర్టులో కేసు వేసిన తర్వాత మాత్రమే.. మమ్మల్ని పోలీసులు విడుదల చేశారు. లేదంటే మమ్మల్ని అక్కడే చంపేసేవాళ్లు. నేను ఆడబిడ్దని.. నాకు న్యాయం చేయండి. డబ్బులు ఇచ్చిన వీడియోలు అన్ని ఉన్నాయి. మాకు అంత సీన్ లేదు అని ప్రచారం చేస్తున్నారు. మహా టీవీలో డిబేట్ పెట్టండి.. సతీష్‌ని పిలవండి.. నేను వస్తాను. నా కుటుంబానికి రక్షణ కల్పించి.. మా ఆస్తులు మాకు ఇప్పించండి. చనిపోదాం అనిపిస్తుంది.. అలా వేధిస్తున్నారు. పవన్, లోకేష్ నా ఆవేదన వినండి. ఆస్తులు పోగొట్టుకొని నడి రోడ్డు మీద నిలబడ్డాను. మాకు బుద్ధి వచ్చింది రాజకీయాల వైపు ఇంకెప్పుడు చూడను. మాకు న్యాయం చేయకపోతే మాకు చావే శరణ్యం. చంద్రబాబు, లోకేష్‌కి కూడా మా సమస్య తెలియజేశాం. కిడ్నాప్ చేశారు కాబట్టే మేము మీడియా ముందుకు వచ్చాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


