పార్థసారథికి టికెటిస్తే ఓడిస్తాం! | Sakshi
Sakshi News home page

పార్థసారథికి టికెటిస్తే ఓడిస్తాం!

Published Sun, Feb 18 2024 5:41 AM

Tdp intimate meeting at eluru district  - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీలో రాజకీయ ప్రకంపనలు తారాస్థాయికి చేరాయి. తాజా పరిణామాలు ఆ పార్టీ ఆశావహ అభ్యర్థి పార్థసారథికి గట్టి షాక్‌ ఇస్తున్నాయి. స్థానికేతరుడికి టికెట్‌ ఇవ్వడంతో నియోజకవర్గంలో టీడీపీ టికెట్‌ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్‌ ఇప్పటికే పార్టీ కి రాజీనామా చేయగా.. రెండు రోజుల్లో టికెట్‌ విషయం తేల్చకపోతే తన దారి తాను చూసుకుంటానని ముద్దరబోయిన అల్టిమేటం ఇచ్చారు. స్థానికేతరుడికి టికెటిస్తే ఓడించి తీరతామని అల్టిమేటం జారీచేశారు. టీడీపీ కేడర్‌తో శనివారం జరిగిన సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.  

పార్థసారథికి టీడీపీ కేడర్‌ ఝలక్‌ 
పార్థసారథి టీడీపీలో చేరడం ఇప్పటికే ఖరారైంది. చంద్రబాబు చింతలపూడిలో నిర్వహించిన సభకు పార్థసారథి వాహనాలు ఏర్పాటు చేసి జనాలను తరలించారు. దీంతో పాటు నియోజకవర్గంలోనూ స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. గత మూడు రోజులుగా టీడీపీ ఐవీఆర్‌ఎస్‌ సర్వే పేరుతో పార్టీ కేడర్‌కు ఫోన్లు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం గోగులంపాడులో టీడీపీ మండల నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో పార్థసారథి పాల్గొన్నారు.

చంద్రబాబు సొంత సామాజికవర్గ నాయకులు మినహా మిగిలినవారు ఎవరూ హాజరుకాలేదు. నూజివీడు టికెట్‌ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్‌ టికెట్‌ పోరాటంలో అలసిపోయి పార్టీ కి రాజీనామా చేశారు. టికెట్‌ కోసం ముద్దరబోయినపై కాపా గట్టి పోరాటం చేశారు. పోటీ కార్యక్రమాలు, పార్టీ కార్యాలయాలకు వెళ్లి ఇన్‌చార్జిపై ఫిర్యాదు కూడా చేశారు. చివరకు పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. అయితే నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాత్రం అందుకు సిద్ధంగా లేరు.

మూటలతో వస్తే మద్దతివ్వం: ముద్దరబోయిన
శనివారం సాయంత్రం ముద్దరబోయిన తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి జనసేన నేతలను కూడా ఆహ్వానించగా వారు సభకు దూరంగా ఉన్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబునాయుడిని కలిస్తే మీకు సర్వేలన్నీ బాగున్నా.. టికెట్‌ సర్దుబా టు చేయలేకపోతున్నామని తనకు చెప్పారని కేడర్‌ ముందు ఆయన వాపోయారు. పదేళ్ల నుంచి ఓడిపోతున్నా పార్టీ కోసం నియోజకవర్గంలో పనిచేస్తుంటే ఇప్పుడు టికెట్‌ లేదనడం కరెక్ట్‌ కాదని, రెండు మూడు రోజుల్లో టికెట్‌ విషయం తేల్చి చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు.

టికెట్‌ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తన దారి తాను చూసుకుంటానని అధిష్టానానికి ముద్దరబోయిన స్పష్టం చేసినట్లు సమాచారం. పార్థసారథి వస్తే ఓడించి తీరుతామని, పార్టీ కోసం పనిచేసేవారికి కాకుండా మూటలతో వచ్చిన వారిని సమరి్ధంచమని సమావేశంలో బహిరంగంగానే ప్రకటనలు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement