నిండు కుండల్లా కాలువలు
● పొట్ట దశలో మునిగిపోతున్న వందలాది ఎకరాలు
● ఎగదన్నుతున్న డ్రెయిన్‌లే కారణం
● పట్టించుకోని అధికారులు
ఉండి: డ్రెయిన్లలో నీరు పారక ఎగదన్నుతుండడంతో వందలాది ఎకరాల వరి పంట నీట మునిగిపోతుంది. సంబంధిత అధికారులకు సమాచారం అందించినా వారు నిర్లక్ష్యం చేయడంతో రైతులు రోడ్డెక్కెందుకు సిద్ధపడ్డారు. గత వారం రోజుల నుండి ఉండి బొండాడ డ్రెయిన్‌తో పాటు దాని అనుబంధంగా ఉండే మీడియం, స్మాల్ డ్రెయిన్‌లు నిండుకుండల్లా మారాయి.
ఉండి మండలంలోని యండగండి, ఆరేడు, పాందువ్వ, ఉప్పులూరు, కోలమూరు, పాములపర్రు, చిలుకూరు, వెలివర్రు, ఎన్నార్పీ అగ్రహారం, వాండ్రం గ్రామాలకు చెందిన వరిసాగు వ్యర్థాలతో పాటు గణపవరం మండలం, పాలకోడేరు మండలం, ఆకివీడు మండలాల్లోని పలు గ్రామాల్లో వరిసాగు వ్యర్థాలు ఆయా డ్రెయిన్‌ల ద్వారా ప్రవహించి ఉండి బొండాడ మేజర్ డ్రెయిన్‌లో కలుస్తాయి. గత వారం రోజుల నుంచి మేజర్ డ్రెయిన్‌తో పాటు అన్ని రకాల డ్రెయిన్లలో నీరు పారకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
ఆక్రమణల్లో బొండాడ మేజర్ డ్రెయిన్
వరి సాగు ముంపుపై అధికారులకు సమాచారమిచ్చిన రైతులకు డ్రెయిన్‌పై అక్రమ కట్టడాలు ఉన్నాయి. వాటిని రేపు తొలగిస్తామంటూ రెండు రోజుల క్రితం రైతులకు వాగ్దానం చేశారు. అయితే వాగ్దానమిచ్చిన అధికారుల జాడ తెలియకపోవడంతో రైతులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు.
చిరుపొట్ట దశలో వరి చేలు
వరి చేలు ప్రస్తుతం చిరుపొట్ట దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం వరి చేనుకు సరిపడేంత నీరు మాత్రమే ఉండాలి. అయితే వరిచేను నిండా నీరు ఉండటంతో దెబ్బతినే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి పరిస్థితి వల్ల దిగుబడులు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు పూర్తిస్థాయిలో వరిసాగు నాశనం అయ్యే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఒకవైపు డ్రెయిన్‌లు ఎగదన్ని నీరు వెనక్కి ప్రవహిస్తుండగా ఇదే సమయంలో పంటకాలువల్లో సాగు నీరు వేగంగా ప్రవహించడంతో వరిపంట మునిగేలా ఉంది. మండలంతో పాటు బొండాడ మేజర్ డ్రెయిన్‌కు అనుసంధానంగా ఉన్న వరిచేలల్లో ఇప్పుడు ఆక్వా వ్యర్థాలు కలుస్తున్నాయంటూ రైతులు భయపడుతున్నారు. ఉండితో పాటు ఇతర మండలాల్లో వరిసాగు కంటే ఎక్కువగా ఆక్వా సాగు జరుగుతుండటంతో వాటి వ్యర్థాఽలు కూడా బొండాడ మేజర్ డ్రెయిన్‌లో కలుస్తుండటంతో సమస్య మరింత పెద్దగా మారింది. డ్రెయిన్లలో నీరు ఎగదన్నడంతో స్మాల్, మీడియం డ్రెయిన్లలో ప్రవహిస్తున్న ఆక్వా వ్యర్థాలు నేరుగా వరిచేలల్లో కలుస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడైనా వెంటనే చర్యలు తీసుకోకపోతే రోడ్డెక్కి ధర్నాలు చేసేందుకు వెనుకడమంటూ రైతులు హెచ్చరిస్తున్నారు.


