ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో బాణసంచా విక్రయ, నిల్వ కేంద్రాల భద్రతపై పోలీస్ అధికారులు నిఘా ఉంచారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించారు. జాతీయ రహదారిపై బాణసంచా దుకాణాన్ని తనిఖీ చేసిన అనంతరం భద్రతా కారణాల రీత్యా సీ–మార్ట్ మందుగుండు సామగ్రి విక్రయ కేంద్రాన్ని మూసివేయాలని వన్‌టౌన్ సీఐ జీ.సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారిపై ఉండటంతో ఏదైనా భారీ ప్రమాదం చోటుచేసుకుంటే తీవ్రత అధికంగా ఉంటుందని, తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకూ షాపును మూసివేయాలని ఆదేశించారు. నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రికి అగ్నిమాపక నిబంధనలు పాటిస్తూ, ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


