భీమడోలు: జాతీయ, రాష్ట్ర రహదారులను సోమవారం తెల్లవారుజాము నుంచి పొగమంచు దట్టంగా కమ్మేసింది. మహాశివరాత్రికి శివ శివమంటూ చలి పోతుందని అంటారు. అందుకు భిన్నంగా వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఉదయం చలి.. మధ్యాహ్నం ఎండతో ఠారెత్తుతుంది. సోమవారం తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరడంతో దట్టమైన పొగమంచు అలుముకుంది. ఉదయం 9 గంటల వరకు రోడ్లపై మంచు దుప్పటిలా కమ్మేయడంతో వాహనాలు సైతం లైట్లు వెలుతురులో రాకపోకలు సాగించాయి. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భీమడోలు జంక్షన్ మంచు దుప్పటిగా మారింది. ఎటూ చూసిన మంచే.. నాలుగు వైపులా నుంచి భీమడోలు జంక్షన్‌కు చేరుకునే వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి. ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు సైతం నెమ్మదిగా ప్రయాణించాయి. భీమడోలు, గుండుగొలను, పొలసానిపల్లి, పూళ్ల హైవేలపై మంచు దుప్పటి కప్పేసింది.


