సాక్షి, తాడేపల్లి: పెట్టుబడుల పేరుతో తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ చేసుకుంటున్న ప్రచారమంతా వట్టి బూటకమేనని, కంపెనీల ఏర్పాటు పేరుతో వేల కోట్ల విలువైన భూములు బినామీలకు దోచిపెట్టి ప్రభుత్వ సంపదను దోపిడీ చేస్తున్నది మాత్రమే నిజమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్‌రెడ్డి అన్నారు.
మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏటా పెట్టుబడుల పేరుతో చంద్రబాబు చేస్తున్న దావోస్ పర్యటనలన్నీ బోగస్ అని, లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయన చెప్పడమే తప్ప వాటిలో కార్యరూపం దాల్చిన వాటి వివరాలు చెప్పే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. తమను తాము పొగుడుకోవడానికో, వైఎస్ జగన్‌ని తిట్టడానికే దావోస్ వెళ్లడం దేనికని సతీష్ రెడ్డి మండిపడ్డారు.
పక్క రాష్ట్రం తెలంగాణలో భూములను వేలం వేసి మరీ కంపెనీలకు అప్పజెబుతుంటే, చంద్రబాబు మాత్రం ఎకరం 99 పైసలకే కట్టబెట్టడం దోపిడీకాక ఇంకేమిటని ప్రశ్నించారు. దీనిపై జర్నలిస్టులు ప్రశ్నిస్తే.. మా ఇష్టం నేనిస్తా అని చెబుతున్న నారా లోకేష్‌కి అధికార మదం తలకెక్కిందని మండిపడ్డారు. అంతగా ఇవ్వాలనుకుంటే హెరిటేజ్ ఆస్తులు ఇచ్చుకోవాలని సూచించారు. ఇలాంటి నిరంకుశ నియంత పోకడలతోనే ఫ్రెంచి విప్లవం పుట్టిందనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వ విధానాలపై తెలుగుదేశం అనుకూల మీడియాలోనే తీవ్రమైన వ్యతిరేక కథనాలు వస్తున్నాయని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
నారా లోకేష్‌కి అధికార మదం తలకెక్కింది
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రిగా పెట్టుబడుల పేరుతో దావోస్ పర్యటనలు చేసే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ పబ్లిసిటీ పిచ్చికి వందల కోట్ల ప్రజాధనం వృథా అవుతోంది. పెద్ద మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేసి తమను తామే పొగుడుకోవడం, వైఎస్ జగన్‌ని తిట్టడం తప్ప, రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు మాత్రం శూన్యం. 2014-19 మధ్య జరిగిందే ఇప్పుడూ జరుగుతోంది. లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామని ఎల్లో మీడియాలో ఇబ్బడిముబ్బడిగా రాయిస్తారే కానీ, వాటిలో కార్యరూపం దాల్చిన వాటి వివరాలు మాత్రం ఎప్పటికీ చెప్పరు.
కానీ వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్ జగన్ కృషితో ఏర్పాటైన పరిశ్రమలకు శంకుస్థాపనలు, భూమి పూజలు చేసి తామే సాధించినట్టుగా క్రెడిట్ చోరీకి పాల్పడుతుంటారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నిత్యం వైఎస్ జగన్‌ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. సీఎంగా చంద్రబాబు రూ.23 లక్షల కోట్ల ఎంవోయూలు చేసుకుంటే వాటిలో కార్యరూపం దాల్చినవి 5 శాతం కూడా లేవు. పారిశ్రామిక అభివృద్ధి, కంపెనీల ఏర్పాటు పేరుతో ఊరూపేరులోని కంపెనీలకు విశాఖలో వేల కోట్ల విలువైన భూములు ఎకరం 99పైసలకు కట్టబెడుతున్నారు.
తెలంగాణలో ప్రభుత్వ స్థలం ఓపెన్‌గా వేలం వేసి ఎకరం రూ.170 కోట్లకు విక్రయిస్తుంటే, చంద్రబాబు మాత్రం పెట్టుబడుల పేరుతో తన బినామీలకు అప్పనంగా కట్టబెట్టేస్తున్నాడు. భూ పంపిణీ రూపంలో ఏడాదిన్నరలోనే చంద్రబాబు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. అప్పనంగా భూములు కట్టబెట్టడంపై జర్నలిస్టులు నారా లోకేష్‌ని ప్రశ్నిస్తే.. విమర్శలకు సమాధానం చెప్పకుండా నా ఇష్టం, నేనిస్తా అంటున్న నారా లోకేష్ అహంకారాన్ని ప్రజలే దించుతారు. అప్పనంగా ఇచ్చుకోవాలంటే హెరిటేజ్ ఆస్తులు ఇచ్చుకో, ప్రజల సంపదను దోచిపెట్టడానికి నారా లోకేష్ ఎవరు?
విదేశీ పర్యటనను రహస్యంగా ఎందుకు ఉంచారు?
ప్రైవేట్ కార్యక్రమం అంటూనే నారావారిపల్లెలో కుటుంబంతో కలిసి జరుపుకున్న సంక్రాంతి సంబరాలను టీవీల్లో లైవ్ ఇచ్చుకున్న చంద్రబాబు, వారం రోజులు తండ్రీకొడుకులు విదేశీ పర్యటనకు వెళ్లిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు? కనీసం ఏ దేశానికి వెళ్లిందీ ఎందుకు చెప్పలేదు? పర్యటన వివరాలను అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలా బాధ్యతమరిచి వ్యవహరించడంపై ప్రజల్లో చాలా అనుమానాలున్నాయి.
రాష్ట్రంలో దోచుకుంటున్న అవినీతి సంపదను పెట్టుబడుల రూపంలో దాచుకోవడానికే విదేశీ పర్యటనలు చేశారని ప్రజలంతా అనుకుంటున్నారు. దీనికి తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పి తీరాల్సిందే. టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలో సైతం ప్రభుత్వ పెద్దల అవినీతిపై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజనీతి అనే టీడీపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్లో రాష్ట్రంలో ఉన్న అనేక మంది ఐఏఎస్ అధికారులు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని అభియోగం మోపారు. ఈ 19 నెలల కూటమి పాలనలో ఒక్కో అధికారి రూ. 300 నుంచి రూ. 500 కోట్ల వరకు దోచుకున్నాడని అందులో సీనియర్ జర్నలిస్ట్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు.
నిజాయితీ ఉంటే టీడీపీ మీడియా చేసిన ఆరోపణలకైనా చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని చంద్రబాబే ఐఏఎస్ అధికారుల సమావేశంలో స్వయంగా ఒప్పుకున్నాడు. చంద్రబాబే దోపిడీకి డోర్లు బార్లా తెరవడంతో ఆయన బాటలోనే కూటమి ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోతున్నారు. కుటుంబంతో కలిసి సంతోషంగా జరుపుకోవాల్సిన సంక్రాంతి సంబరాలను సైతం దోపిడీ మార్గంగా మార్చకున్నారు.

కోడి పందేలకు బరులు ఏర్పాటు చేసి కేసినోల తరహాలో పేకాట ఆడించి మద్యం ఏరులై పారించారు. కమీషన్ల రూపంలో వేల కోట్లు దోచుకుతిన్నారు. కూటమి ప్రభుత్వం లాంటి విధానాలను అవలంభించడం వల్లనే ఆనాడు ఫ్రెంచి విప్లవం వచ్చిందనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. అభివృద్ధి జరిగితే నేనే అని, అవినీతి జరిగితే పక్కనోళ్ల మీదకు నెట్టే చంద్రబాబు విధానం మార్చుకోవాలని సతీష్ రెడ్డి హితవు పలికారు.


