బీఆర్‌ఎస్‌లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్‌.. ఆ 70 మంది పరిస్థితేంటి? | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్‌.. ఆ 70 మంది పరిస్థితేంటి?

Published Sun, Jun 25 2023 7:41 AM

Suspense Over Allotment Of Assembly Seats In BRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేసిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. పోటీలో ఉండే అభ్యర్థులు ఒక్కొక్కరికి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇతర ఆశావహుల పనితీరు ఆధారంగా జాబితాపై కసరత్తు చేస్తున్నారని అంటున్నాయి. స్పష్టత వచ్చిన అభ్యర్థులకు కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వివిధ సందర్భాల్లో పరోక్షంగా పోటీ చేసేది మీరేనంటూ సంకేతాలు ఇస్తున్నారని వివరిస్తున్నాయి. 

20 స్థానాల్లో సిట్టింగ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌..
ఇప్పటివరకు సుమారు 20 అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతోపాటు మరో అరడజను స్థానాల్లో కొత్త అభ్యర్థులకు దాదాపు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని స్పష్టం చేస్తున్నాయి. ఇదే తరహాలో పార్టీ, అధికారిక కార్యక్రమాల్లో మరికొందరు అభ్యర్థుల పేర్లనూ పరోక్షంగా క్లియర్‌ చేయాలని భావిస్తున్నారని చెప్తున్నాయి. మొత్తంగా జూలై నెలాఖరులోగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నాయి. పనితీరు బాగోలేని, వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేల స్థానాలు, విపక్షాల వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని స్థానాలు కలిపి.. 20–30 సీట్లలో అభ్యర్ధులపై చివరి నిమిషం వరకు సస్పెన్స్‌ కొనసాగే పరిస్థితి ఉందని వివరిస్తున్నాయి. 

ఏదో ఓ కార్యక్రమంలో.. సంకేతాలిస్తూ.. 
కేసీఆర్, కేటీఆర్‌ ఇటీవల జిల్లా పర్యటనలు, సభలు, సమావేశాల్లో పార్టీ అభ్యర్థుల విషయంలో సంకేతాలు ఇస్తూ ఇస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌)తోపాటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), ఆరూరి రమేశ్‌ (వర్ధన్నపేట), ఒడితెల సతీశ్‌కుమార్‌ (హుస్నాబాద్‌), దాస్యం వినయభాస్కర్‌ (వరంగల్‌ పశ్చిమ), నల్లమోతు భాస్కర్‌రావు (మిర్యాలగూడ) ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు గువ్వల బాలరాజు (అచ్చంపేట), ఆల వెంకటేశ్వర్‌రెడ్డి (దేవరకద్ర), జాజాల సురేందర్‌ (ఎల్లారెడ్డి), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి), ఆశన్నగారి జీవన్‌రెడ్డి (ఆర్మూరు), బిగాల గణేశ్‌ గుప్తా (నిజామాబాద్‌ అర్బన్‌), షకీల్‌ అహ్మద్‌ (బోధన్‌), మర్రి జనార్దన్‌రెడ్డి (నాగర్‌కర్నూల్‌), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల)లకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్టు తెలిసింది. 

అక్కడక్కడా ఆశావహులకు చాన్స్‌! 
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసేందుకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతోపాటు సుమారు 70 మంది ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ఆశావహుల్లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్‌ పర్సన్లు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. ఇలా తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ వీలైనచోట ఆశావహుల పేర్లను పరోక్షంగా కేసీఆర్‌ ఖరారు చేస్తున్నారు. ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ మన్నె క్రిషాంక్‌ ఇప్పటికే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 

ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నుంచి సంకేతాలు అందడంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కూడా దుబ్బాక నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. వేములవాడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ స్థానంలో చల్మెడ లక్ష్మీనర్సింహారావు రంగప్రవేశం చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. శనివారం వేములవాడలో యువ సమ్మేళనం నిర్వహించి కేసీఆర్‌ ఆశీర్వాదంతోనే ముందుకు వెళ్తున్నట్టు ప్రకటించారు. 

జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావు స్థానంలో కొత్తవారికి అవకాశం దక్కుతుందనే ప్రచారం నేపథ్యంలో.. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ స్థానిక నేతలను కలుస్తుండగా, ఢిల్లీ వసంత్‌ జయహో జహీరాబాద్‌ పేరిట ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి పోటీచేసిన బోయినపల్లి వినోద్‌కుమార్, మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిలకు వచ్చే ఎన్నికల్లోనూ మీరే అభ్యర్ధులు అంటూ సంకేతాలు అందాయి.  

ఇది కూడా చదవండి: పోడు రైతులకు 30 నుంచి పట్టాల పంపిణీ

Advertisement
 
Advertisement