రాహుల్‌ సభలో తొక్కిసలాట | A Stampede Like Situation Broke Out During Rahul Gandhi And Akhilesh Yadav Election Rally In UP | Sakshi
Sakshi News home page

రాహుల్‌ సభలో తొక్కిసలాట

Published Mon, May 20 2024 4:09 AM

A stampede like situation broke out during an election rally

పలువురు కార్యకర్తలకు గాయాలు

ప్రసంగించకుండా వెళ్లిపోయిన రాహుల్, అఖిలేశ్‌

ఉత్తరప్రదేశ్‌లోని పడిలా ప్రాంతంలో ఘటన

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ పాల్గొన్న ఎన్నికల ప్రచారసభలో అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో సభావేదిక వద్ద తొక్కిస లాట జరిగింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆదివారం ఫూల్‌పూర్‌ నియోజకవర్గం పరిధిలోని పడిలా ప్రాంతంలో నిర్వహించిన ప్రచారసభ ఈ ఘటనకు వేదికైంది. ప్రచారసభకు రాహుల్, అఖిలేశ్‌ వస్తున్నారని తెల్సి ఇరుపార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కిక్కిరిసన జనంతో సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది.

ప్రసంగించేందుకు అఖిలేశ్‌ సభావేదిక మీదకు రాగానే జనం వేదికపైపు హఠాత్తుగా ముందుకొచ్చారు. బారికేడ్లు, అడ్డుగా ఏర్పాటుచేసిన కర్రలను తొలగించి మరీ దూసుకొచ్చారు. దీంతో ఒక్కసారి తొ క్కిసలాట జరిగింది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. వెనక్కి వెళ్లండి అని వేదికపై నుంచి అగ్రనేతలు హెచ్చరించినా కార్యకర్తలు ఎవ్వరూ వినిపించుకోలేదు. ఓటర్ల శాంతించాలని విన్నవించినా పట్టించుకోలేదు. చాలా మంది రాహుల్, అఖిలేశ్‌ దాకా వచ్చి వారితో షేక్‌హ్యాండ్‌ కోసం స్టేజీ వద్ద ఎగబడ్డారు. 

ఈ హఠాత్‌ పరిణామంతో, భారీగా పోగైన కార్యకర్తలను నిలువరించలేక పోలీసులు చేతులెత్తేశారు. దాంతో అక్కడ మొత్తం గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మీ భద్రతకు ముప్పుందని అక్కడి భద్రతా, పోలీసు సిబ్బంది అగ్రనేతలు రాహుల్, అఖిలేశ్‌లను అప్రమత్తంచేశారు. ఈ పరిస్థితుల్లో ప్రసంగించాలా వద్దా అని రాహుల్, అఖిలేశ్‌ కొద్దిసేపు మాట్లాడు కున్నారు. తర్వాత ప్రసంగించకుండానే ఇద్ద రు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సభ అర్ధంతరంగా ముగిపోయింది. తర్వాత అక్కడి సమీపంలోని ముంగారీ ర్యాలీలో ప్రసంగించారు. అక్కడ కూడా దాదాపు ఇదే మాదిరిగా కార్యకర్తలు బారికేడ్లను దాటుకొని ముందుకు రాబోయారు. 

యూపీలో బీజేపీకి దక్కేది ఒక్కటే సీటు: రాహుల్‌
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో మాత్రమే బీజేపీ గెలుస్తుందని రాహుల్‌ గాంధీ జోస్యంచెప్పారు. ఆదివారం ఆయన ‘ఇండియా’ అభ్యర్థి ఉజ్వల్‌ రమణ్‌ సింగ్‌ తరఫున రాష్ట్రంలోని ప్రయాగరాజ్‌లో ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌తో కలిసి ప్రచారం చేశారు. జపాన్‌లోని సుందరనగరం క్యోటోలాగా వారణాసిని తీర్చిదిద్దుతానని మోదీ గతంలో ఇచ్చిన హామీని రాహుల్‌ ఈ ర్యాలీలో ప్రస్తావించారు. 

‘‘ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ క్యోటో సీటును మాత్రమే మోదీ గెలవబోతున్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచే సీటు అదొక్కటే. కోవిడ్‌కాలంలో బీజేపీ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టింది. ఇప్పుడు ఏకంగా రాజ్యాంగాన్ని ఇష్టారీతిన మార్చేందుకు తెగబడింది’’ అని అన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement