
సాక్షి,ఢిల్లీ: దేశంలో కోవిడ్-19 కేసులు విజృంభిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది. ప్రధాని మోదీతో భేటీ అయ్యే నేతలు తప్పని సరిగా కోవిడ్-19 ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన నివాసంలో ఢిల్లీ బీజేపీ నేతలకు ఇవాళ సాయంత్రం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఢిల్లీకి చెందిన దాదాపు 70 మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్ననున్నారు.
అయితే, దేశంలో కోవిడ్-19 నమోదువుతున్న కోవిడ్-19 కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈరోజు (బుధవారం) 7 వేల మార్కును దాటాయి. దీంతో పార్టీ అధినాయకత్వం పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం మోదీతో భేటీ కానున్న నేతలు తప్పని సరిగా ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని సూచించింది.
మరోవైపు దేశంలో కోవిడ్-19 కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం డేటాను విడుదల చేసింది. ఆ డేటా ఆధారంగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదు కాగా ఆరుగురు మరణించారు. కోవిడ్ కారణంగా కేరళలో ముగ్గురు, మహారాష్ట్ర (1),కర్ణాటక (2) మరణించారు.
కేరళలో అత్యధికంగా ఒకే రోజు 170 కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 114 కొత్త ఇన్ఫెక్షన్లు, 1,223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్ణాటకలో 100 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటాలో పేర్కొంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 66 కొత్త కేసులు నమోదుగా.. రాజధానిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 757కు చేరుకుంది. కేరళ మొత్తం 2,000 యాక్టివ్ కేసులు మార్కును దాటడంతో అగ్రస్థానంలో ఉంది. తరువాత గుజరాత్, పశ్చిమ బెంగాల్,ఢిల్లీ ఉన్నాయి.
