ఆ ప్రస్తావన ఎందుకు?: రాహుల్‌ గాంధీ | Rahul meets LS Speaker says reference to Emergency could have been avoided | Sakshi
Sakshi News home page

ఆ ప్రస్తావన ఎందుకు?: రాహుల్‌ గాంధీ

Jun 28 2024 4:40 AM | Updated on Jun 28 2024 4:50 AM

Rahul meets LS Speaker says reference to Emergency could have been avoided

పార్లమెంట్‌లో ఎమర్జెన్సీ అంశాన్ని నివారించి ఉండాల్సింది

స్పీకర్‌తో మర్యాదపూర్వక భేటీ సందర్భంగా రాహుల్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ తొలి సెషన్‌ సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ‘ఎమర్జెన్సీ’ని ప్రస్తావిస్తూ తీర్మానం చేయడాన్ని విపక్షనేత రాహుల్‌ గాంధీ మరోమారు తీవ్రంగా తప్పుబట్టారు. బిర్లాను గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయ అంశమైన ‘ఎమర్జెన్సీ’ని ప్రస్తావించకుండా ఉండాల్సింది అన్నారు. ‘‘రాహుల్, ఇండియా కూటమి నేతలు స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నేతలంతా పార్లమెంటరీ వ్యవహారాలు మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే ఎమర్జెన్సీ అంశమూ ప్రస్తావనకు వచి్చంది.

రాహుల్‌ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రాజకీయ అంశాన్ని సభలో లేవనెత్తకుండా నివారిస్తే బాగుండేదన్నారు’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ వెల్లడించారు. ఈ అంశంపై కేసీ వేణుగోపాల్‌ విడిగా స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. ‘పార్లమెంట్‌ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీసే అంశమిది. స్పీకర్‌గా మిమ్మల్ని ఎన్నుకున్న శుభతరుణంలో అర్ధశతాబ్దకాలంనాటి ఎమర్జెన్సీ అంశాన్ని మీరు సభ ముందుకు తేవడం విపక్షాలన్నింటినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. స్పీకర్‌ ఎన్నిక, బాధ్యతల స్వీకరణ వేళ రాజకీయాలు మాట్లాడటం పార్లమెంట్‌ చరిత్రలో ఇదే తొలిసారి.

నూతన స్పీకర్‌గా ఎన్నికయ్యాక చేపట్టాల్సిన తొలి విధులకు ఇలాంటి చర్యలు తీవ్ర విఘాతం కల్గిస్తాయి. పార్లమెంటరీ సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ సాగిన ఈ ఉదంతంపై మేం ఆందోళన చెందాం’’ అని వేణుగోపాల్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘1975 జూన్‌ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ‘అత్యయిక స్థితి’ అమల్లోకి తెచ్చారు. చాలా మంది ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పడేసింది. మీడియాపై ఆంక్షలు విధించింది.

న్యాయ వ్యవస్థపై నియంత్రణ చట్రం బిగించింది. ఎమర్జెన్సీ విధించి 49 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సభ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని పరిరక్షించడంతోపాటు దాని విలువలకు కట్టుబడి ఉందని నేను హామీ ఇస్తున్నా’’ అని నూతన స్పీకర్‌ బిర్లా బుధవారం పేర్కొన్నారు. స్పీకర్‌ ఆ తీర్మానాన్ని చదువుతున్న సందర్భంలో కాంగ్రెస్‌ సహా విపక్ష నేతలంతా నిలబడి తీవ్ర నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement