హృదయం, ప్రాణం, రక్తంతో రాజ్యాంగాన్ని కాపాడుతాం: రాహుల్‌ గాంధీ | Sakshi
Sakshi News home page

హృదయం, ప్రాణం, రక్తంతో రాజ్యాంగాన్ని కాపాడుతాం: రాహుల్‌ గాంధీ

Published Wed, May 29 2024 4:04 AM

Rahul Gandhi comments on BJP

రాహుల్‌ గాంధీ హామీ  

బనస్‌గావ్‌:  కేంద్రంలో విపక్ష ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై అమల్లో ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తామని, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని హృదయం, ప్రాణం, రక్తంతో కాపాడుతామని ప్రకటించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బనస్‌గావ్‌లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ ప్రసంగించారు.

కేవలం అంబానీకి, అదానీకి మేలు చేయడానికే ప్రధాని మోదీని భగవంతుడు భూమికిపైకి పంపించాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో సిద్ధాంతాల మధ్య పోరాటం కొనసాగుతోందన్నారు. ఇండియా కూటమి, రాజ్యాంగం ఒకవైపు, రాజ్యాంగాన్ని అంతం చేయాలనుకుంటున్న శక్తులు మరోవైపు ఉన్నాయని చెప్పారు. భారత రాజ్యాంగానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తన జీవితాన్ని అంకితం చేశారని ఉద్ఘాటించారు.

దళితులకు రాజ్యాంగం తగిన గౌరవం కలి్పంచిందని గుర్తుచేశారు. అలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. అంబేడ్కర్, జవహర్‌లాల్‌ నెహ్రూ ఇచ్చిన ఇచ్చిన రాజ్యాంగం జోలికి ఎవరూ రావొద్దని రాహుల్‌ గాంధీ హెచ్చరించారు.   

ఈ ఎన్నికలు చాలా కీలకం  
ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో 22 మంది బిలియనీర్లను సృష్టించారని, తమకు అధికారం అప్పగిస్తే దేశంలో కోట్లాది మంది లక్షాధికారులను సృష్టిస్తామని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. మోదీ తన బిలియనీర్‌ మిత్రుల కోసం రూ.16 లక్షల కోట్ల రుణాలు రద్దు చేశారని, ఈ విషయాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. పేదలను లూటీ చేసి, పెద్దలకు కట్టబెట్టారని, ఆ సొమ్మంతా విదేశాలకు తరలిపోయిందని విమర్శించారు. ఈ ఎన్నికలు ప్రజలకు చాలా కీలకమని వెల్లడించారు. మన దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement