సాక్షి, తాడేపల్లి: ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో రావణకాష్ఠాన్ని మించిన అల్లకల్లోలం నడుస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్-ఇండియా సరిహద్దుల్లోని పీవోకే దగ్గర కూడా ఇటువంటి ఘటనలు జరిగి ఉండవన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడా జరగని అరాచకం నేడు ఏపీలో కొనసాగుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘‘రాష్ట్రంలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు పార్లమెంటు సభ్యులపై హత్యాయత్నాలు జరుగుతున్నాయి. మనం ఆటవిక సామ్రాజ్యంలో ఉన్నామా?, నియంతృత్వం చేతిలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది. పులివెందుల నియోజకవర్గం అగుడూరు వద్ద ఎంపీ అవినాష్‌రెడ్డిని హతమార్చడానికి పక్కా ప్రణాళికతో దాడి చేశారు. నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు కోర్టు ఆర్డర్‌తో రక్షణగా వెళ్లిన ఎంపీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి పోలీసులను అడ్డుపెట్టుకొని కిరాయి గూండాలు, గంజాయి బ్యాచ్‌లతో దాడి చేయించారు.
..రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లు, పెట్రోల్ బాంబులతో ఎంపీ కాన్వాయ్‌పై ఆటవికంగా విరుచుకుపడ్డారు. పులివెందుల రూరల్ సీఐ శాంతిలాల్, ఎస్ఐ గణ మద్దిలేటి తదితర పోలీసులు దగ్గరుండి ఈ దాడులను ప్రోత్సహించారు. నిన్న బీటెక్ రవి అలిగి కూర్చుంటే డీఐజీ వచ్చి సర్దిచెప్పారు. ఆ తర్వాతే ఇంతటి దారుణమైన దాడి జరిగింది. గతంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఏకే-47లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన డీఐజీ, ఎస్పీలకు నేడు తుపాకుల్లో బుల్లెట్లు అయిపోయాయా?
..ఎంపీని చంపడానికి టీడీపీ గూండాలు వస్తుంటే పోలీసులకు చంద్రబాబు, లోకేష్‌ల నుంచి ఆర్డర్లు రాలేదా?. కంచే చేను మేసినట్లు, దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లు పోలీసులు రౌడీలకు కొమ్ముకాస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ వన్ సైడ్‌గా గెలుస్తుందనే భయంతోనే ఈ దాడులు చేస్తున్నారు. కడప, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లోకి బాంబుల కల్చర్‌ను తీసుకొచ్చారు. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నుంచి తాడేపల్లిగూడెం వరకు నామినేషన్లు వేసిన వారి ఇళ్లు తగలబెడుతున్నారు.
..గతంలో ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తిలపైనా టీడీపీ గూండాలు ఇలాగే హత్యాయత్నాలకు పాల్పడ్డారు. ప్రజలు కసితో ఫ్యాన్ గుర్తుపై ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఏజెంట్లే భయపడుతున్నారు. అరెస్టయితే 24 గంటల్లో బెయిల్ ఇప్పిస్తామని లోకేష్ గతంలో ఇచ్చిన హామీలే నేడు గూండాలకు తెగింపునిచ్చాయి. నామినేషన్లకు రక్షణ కల్పించాలని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చినా పోలీసులు లెక్కచేయడం లేదు.
..పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను కూడా ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్‌లు పెట్టి కలుషితం చేస్తున్నారు. ఎంపీలకే రక్షణ లేని ఈ రాష్ట్రంలో ఇక సామాన్య ఓటర్లకు, వారి ఆస్తులకు రక్షణ ఎక్కడుంటుంది?. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నాటి సౌత్ బీహార్ కంటే అత్యంత దారుణంగా తయారైంది. రాజ్యాంగాన్ని, కోర్టులను గౌరవించని ఈ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేసి, గవర్నర్ పాలన విధించాలి’’ అని పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై హత్యాయత్నం


