
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో పోలీసుల సాయంతో టీడీపీ గూండాలు ఇష్టారాజ్యం రెచ్చిపోతున్నారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులతో ఓట్లు వేయిస్తున్న టీడీపీ.. అసలు ఓటర్లను ఎక్కడికక్కడే అడ్డుకుంటోంది. ఈ క్రమంలో ఖాకీలు ఈ చోద్యమంతా చూస్తూ ఉండిపోతున్నారు. అయితే తాము ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ కొందరు ఓటర్లు అనూహ్య రీతిలో నిరసనకు దిగారు.
పులివెందుల మండలం కనంపల్లిలో గ్రామస్తులను పోలీసులు అడ్డున్నారు. అయితే తమను ఓటు వేయనివ్వండంటూ వాళ్లు పోలీసుల కాళ్లు పట్టుకుంటున్నారు. ‘‘మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనీయండయ్యా’’ అంటూ అభ్యర్థించారు. అయినా పోలీసులు కనికరించలేదు. ఈ క్రమంలో ఇతర గ్రామాల వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారని.. దగ్గరుండి పోలీసులే రిగ్గింగ్ చేయిస్తున్నారంటూ స్థానికులు మండిపడ్డారు.
మరోవైపు.. తమనూ ఓటేయకుండా అడ్డుకుంటున్నారంటూ పులివెందుల మండలంలోని పలువురు మహిళా ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇళ్లలోకి దూరి పోలీసులే మమ్మల్ని బెదిరించారు. మీ ఇంట్లో మగవారు ఎటు వెళ్లారు?అంటూ గదమాయించారు. మా చేతుల్లోని ఓటర్ స్లిప్పులను లాక్కున్నారు. ఓటేయడానికి వెళ్తే ఇక అంతే సంగతులు అంటూ బెదిరించారు అంటూ కొందరు వాపోయారు. ఈ స్థాయిలో అరాచకం ఎప్పుడూ చూడలేదని.. వందల మంది స్థానికేతర రౌడీలు తమ ఓట్లను వేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
