కాంగ్రెస్‌తో పొత్తుకు అవకాశం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో పొత్తుకు అవకాశం

Published Fri, Feb 23 2024 4:30 AM

A possibility of alliance with Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు అవకాశాలున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా కమ్యూనిస్టులతో వెళ్లాలని భావిస్తోందన్నారు. ఒకవేళ పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో సీపీఎం పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

రెండు రోజులపాటు జరగనున్న సీపీఎం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ప్రారంభమైంది. ఆ పార్టీ సీనియర్‌ నేత సారంపల్లి మల్లారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తమ్మినేని మాట్లాడుతూ.. పొత్తు ఉంటుందా? లేదా? అన్నది కాంగ్రెస్‌ పారీ్టనే తేల్చాలన్నారు.

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, కానీ ఒకసారి ఆరు నెలలు, మరోసారి సంవత్సరంలో భర్తీ చేస్తామని అంటున్నారని, ఈ రెండు మాటల్లో మర్మమేంటని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో రామమందిరం ప్రారంభోత్సవ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలని తమ్మినేని వ్యాఖ్యానించారు. అక్షింతలు ఓట్లుగా మారతాయా? బీజేపీకి ఓట్లేస్తారా? అనేది చూడాలన్నారు.
 
బీజేపీపై రేవంత్‌రెడ్డి పోరాడాలి: బీవీ రాఘవులు 
కర్ణాటక ప్రభుత్వ తరహాలో బీజేపీకి వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి ఇక్కడ పోరాడాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కోరారు. లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు వచ్చాయని, అవి సమన్లా లేక గాలమా అనేది కొద్దిరోజుల్లో తేలుతుందని వ్యాఖ్యానించారు.

’’కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓట్లేస్తే మూసీనదిలో వేసినట్టేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారు కానీ నిజానికి కిషన్‌రెడ్డీ నువ్వే మూసీలో పడిపోతావు జాగ్రత్త’’అని రాఘవులు ఎద్దేవాచేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, చుక్క రాములు, జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు, జాన్‌వెస్లీ, పాలడుగు భాస్కర్, టి.సాగర్, మల్లు లక్ష్మి, పి.ప్రభాకర్‌ పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement