చంద్రబాబు హయాంలో నీళ్లకోసం భిక్షమెత్తుకోవాల్సి వచ్చేది

Pocharam Srinivas Reddy comments over chandrababu naidu  - Sakshi

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాల్కొండ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల పాలనలో తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండల కేంద్రం శివారులో వరద కాలువ జీరో పాయింట్‌ వద్ద ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నీటిని శ్రీరాంసాగర్‌లోకి విడుదల చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం మాట్లాడుతూ, నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి నిజామాబాద్‌ జిల్లాకు నీటి విడుదల చేపట్టాలంటే చంద్రబాబు ఇంటి వద్ద భిక్ష మెత్తుకునే పరిస్థితి ఉండేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్‌ నాయకత్వంలో సాగు నీటి కష్టాలు తీరాయన్నారు. పునరుజ్జీవన పథకంతో ఆయకట్టు కింద అదనంగా 50 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతోందన్నారు.

మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నీళ్లను శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి తరలించడం అపూర్వ ఘట్టమ న్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో భూములను కోల్పోయిన రైతులకు, పునరావాస గ్రామాలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నీళ్లు అంది ప్రతిఫలం దక్కుతోందన్నారు.

రాజ్యసభ సభ్యుడు సురేశ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, రేఖా నాయక్, విఠల్‌రెడ్డి, మహిళా సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆకుల లలిత, జెడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సారెస్పీలోకి కాళేశ్వరం నీళ్లు..
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ఎదురెక్కాయి. శుక్రవారం శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మూడవ పంపు వద్ద బటన్‌ నొక్కి మోటార్లను ప్రారంభించారు. నాలుగు మోటార్ల ద్వారా నీరు ఎస్సారెస్పీలోకి ఉరకలేసింది. అనంతరం కాళేశ్వరం నీళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాజెక్ట్‌ నీటితో కాళేశ్వరం నీళ్లు కలుస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top