చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్‌ కోరికకు మోదీ నో | PM Narendra Modi Says No To Chandrababu NDA Chairman wish | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్‌ కోరికకు మోదీ నో

Feb 7 2025 2:28 AM | Updated on Feb 7 2025 4:47 AM

PM Narendra Modi Says No To Chandrababu NDA Chairman wish

కూటమిని బాబు నడిపించేందుకు ప్రధాని అంగీకరించలేదు

రాజ్యసభలో మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు(Chandrababu) ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కూటమికి చైర్మన్‌ లేదా వైస్‌ చైర్మన్‌ అవ్వాలనుకున్నారని మాజీ ప్రధాని దేవెగౌడ(Devegowda) సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ తిరస్కరించారని.. చంద్రబాబు ప్రతిపాదనను అంగీకరించలేదని దేవెగౌడ వెల్లడించారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో దేవెగౌడ మాట్లాడుతూ, ‘2014, 2019 ఎన్నికల్లో మోదీ 300కు పైగా సీట్లు సాధించారు. 2024 ఎన్నికల్లో ఆయనకు 240 సీట్లొచ్చాయి. వివిధ ప్రాంతీయ పార్టీల నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఆయనకు దాదాపు 305 సీట్లు ఉన్నాయి. 

ఇది సభా వేదికపై రుజువైంది. విశ్వాస ఓటు కోరే ప్రశ్నే లేదు. ఎన్డీఏ కూటమికి వైస్‌ చైర్మన్‌ను ప్రధాని నియమించలేదు. యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి మాత్రమే కాకుండా కూటమికి పవర్‌ సెంటర్‌గా చైర్‌పర్సన్‌ కూడా ఉన్నారు. కూటమి చైర్మన్‌ పవర్‌ సెంటర్‌గా ఉంటారు. కానీ.. ప్రధాని మోదీ కూటమిని నడిపించడానికి లేదా ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడానికి ఎవరినీ అనుమతించలేదు’ అని అన్నారు.‘ఇప్పుడు 2024లో మోదీ 240 సీట్లు సాధించినప్పుడు చంద్రబాబు వంటి ఇతర ప్రాంతీయ పార్టీలు ఆయనకు మద్దతు ఇచ్చాయి. 

చంద్రబాబు అన్ని ఎన్‌డీఏ పార్టీలు ఏర్పాటు చేసిన కూటమికి వైస్‌చైర్మన్‌ లేదా చైర్మన్‌ కావాలని కోరుకున్నారు. కానీ.. మోదీ తిరస్కరించారు. పరిపాలన ఎలా నిర్వహించాలో మోదీకి తెలుసు. ప్రధానిగా, ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న మోదీ ఈ దేశాన్ని ఎలాంటి ఊగిసలాట లేకుండా నడపగల మహోన్నత నాయకుడు. నేను నిజం చెబితే మీరు అంగీకరించాలి. నేను ఏదైనా అవాస్తవం చెబితే మీరు నాపై దాడి చేయవచ్చు’ అని వ్యాఖ్యానించారు.

ఖండించిన నడ్డా
కాగా.. దేవెగౌడ ప్రసంగం అనంతరం రాజ్యసభలో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా చంద్రబాబుపై దేవెగౌడ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎన్డీఏలో చంద్రబాబును చైర్మన్‌ చేయాలన్న ఎలాంటి చర్చ జరగలేదని.. అందరూ కలిసి ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) నేతృత్వంలో అందరి సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని నడ్డా స్పష్టం చేశారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement