ఓట్ల కోసం బంగారు కోట కూడా కట్టిస్తామంటారు

PM Narendra Modi Comments On Congress - Sakshi

కాంగ్రెస్‌ అంతటి హామీలు ఇవ్వగలదు

ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ఎద్దేవా

బర్వానీ/ముంగేలీ/మహసామంద్‌: మధ్యప్రదేశ్‌లో గెలుపు కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎంతటి అసాధ్యమైన హామీలనైనా గుప్పించగలదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో మోదీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. రాజస్తాన్‌లో 2022లో ఉదయ్‌పూర్‌ పట్టణంలో దర్జీ కన్హయ్య లాల్‌ను దుండగులు తల నరికిన ఘటనను ప్రధాని గుర్తుచేశారు. ‘‘తల తీసేయండి అనే దారుణ నినాదాలు దేశంలో ఏనాడైనా విన్నామా? రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ అసమర్థ పరిపాలన వల్లే ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.

కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో హింస, లూటీలు పెరిగాయి. అక్కాచెల్లెళ్లు, కూతుళ్లపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి. మధ్యప్రదేశ్‌లోనూ అంతే. బీజేపీ వచ్చాకే ఇవన్నీ ఆగిపోయాయి. గతంలో చక్కగా ఉన్న రాష్ట్రాలు సైతం కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రభను కోల్పోయాయి’’అని మోదీ ఆరోపించారు. ‘ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌ పెద్దలు బంగారంతో కోట కట్టిస్తామని కూడా హామీ ఇస్తాగలరు. బంగాళాదుంపల నుంచి తీసిన బంగారంతోనే ఈ కోట కట్టామంటారు’అని మోదీ ఎద్దేవాచేశారు. ‘బంగాళాదుంపల నుంచీ అతి స్వల్పమొత్తంలో బంగారాన్ని తీయొచ్చు’అని 2017లో రాహుల్‌ గాంధీ అన్న మాటలను మోదీ ఉటంకించారు. 

బఘేల్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది..
ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలీ, మహసామంద్‌ జిల్లాల్లోనూ మోదీ ప్రచారం చేశారు. ‘ఛత్తీస్‌గఢ్‌ను లూటీ చేసి తమ  ఖజానాతో నింపుకోవడమే కాంగ్రెస్‌ పని. ముఖ్యమంత్రి భూపేల్‌ బఘేల్‌ కంటే కూడా ఆయన కుమారుడు, ఇతర ఉన్నతాధికారులు ‘సూపర్‌ సీఎం’గా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేశారు. టీఎస్‌ సింగ్‌ దేవ్‌కూ సీఎం పదవి కట్టబెడతామని పార్టీ మాటిచ్చి మోసం చేసింది. రాష్ట్ర ప్రజల్నీ అలాగే మోసగిస్తుంది. ఈసారి పఠాన్‌ నియోజకవర్గంలో స్వయంగా సీఎం ఓడి పోతారని నా ఢిల్లీ స్నేహితులు చెప్పా రు. ఇక్కడ తమ పని అయిపోయిందని కాంగ్రెస్‌కు తెలుసు’’అని మో దీ వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top