సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా పిన్నెల్లిలో మందా సాల్మన్ అనే కార్యకర్త హత్య ఘటనకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. తాము విధించిన బహిష్కరణను అతిక్రమించి ఊరిలో అడుగు పెట్టాడని టీడీపీ గూండాలు కొందరు ఇనుప రాడ్లతో సాల్మన్‌ను కొట్టి తీవ్రంగా గాయపరిచారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లి సాల్మన్.. చివరకు కన్నుమూశారు. అయితే..
పిన్నెల్లిలో టీడీపీ దాష్టీకాన్ని ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధపడింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గురజాల పరిధిలో 7గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి దారుణాలకు గానూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధపడింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు రాజ్యాంగ రూపకర్త డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించనున్నాయి పార్టీ శ్రేణులు.
ఇప్పటికే సాల్మన్ కేసులో న్యాయం జరిగేదాకా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆ కుటుంబానికి పార్టీ తరఫున రూ.5 లక్షల సాయం కూడా ప్రకటించారు. మరోవైపు..
శుక్రవారం సాల్మన్ మృతదేహానికి పిన్నెల్లిలో అంత్యక్రియలు జరగకుండా టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మృతదేహంతో వస్తున్న వాహనాన్ని పోలీసులతో కలిసి అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల రాక కారణంగానే తాము అడ్డుకుంటున్నట్లు పోలీసు బాహాటంగా ప్రకటించారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ సమయంలోనే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైఎస్ జగన్‌ను ఫోన్ చేసి మాట్లాడారు. అంత్యక్రియలను అడ్డుకుంటూ పోలీసులు వ్యవహరించిన తీరుపైనా ఆయన భగ్గుమన్నారు. అలా గంటన్నర తర్వాత పిన్నెల్లి గ్రామంలోని సాల్మన్ మృతదేహాన్ని, వైఎస్సార్‌సీపీ నేతలను అనుమతించారు.
పిన్నెల్లి గ్రామానికి చెందిన దళితుడు సాల్మన్ మొదటి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరు వదిలి వెళ్లిపోవాలని సాల్మన్‌కు తెలుగుదేశం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రాణభయంతో కుటుంబంతో సహా బ్రహ్మణపల్లికి మకాం మార్చాడు. వైఎస్సార్‌సీపీ నేతలు ధైర్యం చెబుతుండడంతో రెండు నెలల కిందట సాల్మన్ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్లను అడ్డుకున్నారు. పంచాయితీ తర్వాత చివరకు సాల్మన్ మినహా కుటుంబ సభ్యులను మాత్రమే ఊర్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అయితే..
సాల్మన్ భార్య ఈ మధ్య అస్వస్థతకు గురైంది. దీంతో.. ఈనెల 10వ తేదీన పిన్నెల్లి వెళ్లి ఆమెను చూడటానికి సాల్మన్ ప్రయత్నించాడు. రావొద్దన్నా.. ఎందుకు వచ్చావ్ అంటూ టీడీపీ గూండాలు ఆయన్ని రాడ్లతో చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టైంలోనే కోమాలోకి వెళ్లిన సాల్మన్.. చివరకు నాలుగు రోజుల తర్వాత కన్నుమూశాడు. త్వరలో బాధిత కుటుంబాన్ని కలిసి వైఎస్ జగన్ పరామర్శిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.



