కేసీఆర్‌ కూతురు, అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారు: బండి సంజయ్‌ | Phone Tapping Case: Bandi Sanjay Comments On KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కూతురు, అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారు: బండి సంజయ్‌

Aug 8 2025 3:47 PM | Updated on Aug 8 2025 5:13 PM

Phone Tapping Case: Bandi Sanjay Comments On KCR

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆయన స్టేట్‌మెంట్‌ను సిట్‌ అధికారులు రికార్డు చేశారు. విచారణ అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కువగా తన ఫోన్‌ కాల్స్‌నే ట్యాప్‌ చేశారన్నారు.

‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గతంలోనే నోటీస్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో విచారణకు ఆలస్యం జరిగింది. అధికారులు నా ఫోన్ ట్యాపింగ్ వివరాలు చూపెట్టిన తర్వాత నేను షాక్‌కు గురయ్యాను. మావోయిస్టుల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది నా ఫోన్ ట్యాప్ చేశారు. హరీష్‌రావు, రేవంత్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వావి వరసలు లేకుండా ఫోన్ ట్యాప్ చేశారు.  కేసీఆర్‌ కుమార్తె కవిత, అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేశారు’’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

నా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇచ్చాను. సిట్ అధికారులు చెప్పిన విషయాలను విని షాక్‌కు గురయ్యా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ కార్యాచరణను ముందుగానే సమాచారం తెలుసుకుని భగ్నం చేసేవారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోలేదు. వాట్సాప్ కాల్, సిగ్నల్ ద్వారానే మాట్లాడుకునే వారు. మావోయిస్టుల లిస్ట్‌లో మా పేర్లు పెట్టి మా ఫోన్లు ట్యాప్ చేశారు. వేలాది ఫోన్లు ట్యాప్ చేశారు. అక్కడ లిస్ట్ అంతా ఉంది..

ఎస్‌ఐబీను సొంత అవసరాలకు కేటీఆర్ వాడుకున్నారు. కేసీఆర్ దగ్గర పనిచేసిన మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సినిమా వాళ్లు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. గ్రూప్‌-వన్ పేపర్ లీకేజీ ఆందోళన సమయంలో పోలీసులు ముందుగానే మా ఇంటికి పోలీసులు వచ్చారు. గ్రూప్‌-వన్ లీకేజీ కేసు విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు ఫాల్తు గాళ్ళు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది.

వ్యాపార లావాదేవీలు చేసిన పెద్ద వ్యాపారుల ఫోన్‌లు కూడా ట్యాప్ చేశారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర పట్టుకున్న రూ.7 కోట్లు ఎక్కడ?. రూ.20 కోట్లు పట్టుకున్న దగ్గర రెండు కోట్లు మాత్రమే చూపించారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఈడీకి లేఖ రాయడం లేదు. సిట్ అధికారులు నిజాయితీ గల వారు. సిట్ అధికారుల మీద అనుమానం లేదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనుమానం ఉంది. కేసీఆర్, రేవంత్ ఇద్దరు ఒక్కటే.

ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులను రేవంత్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోంది

ముఖ్యమంత్రి ఫోన్‌ను గతంలో ట్యాప్ చేశారు కదా... ఆయనను పిలిచి విచారణ చేస్తారా?. ఒక్కో కేసుకు ఢిల్లీలో ముఠాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ ఇలా ప్రతీ కేసుకు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారింది. కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. కేసీఆర్‌కు సీఎం రేవంత్ క్లీన్ చిట్ ఇవ్వడానికి ఎవరిచ్చారు అధికారం?. ఫోన్ ట్యాపింగ్‌పై పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వాలి.. సీఎం ఎలా ఇస్తారు?. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి?.  ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కేవలం తెలంగాణలోనే ఉన్నాయి. సిట్ విచారణ మీద నమ్మకం లేదు’’ అని బండి సంజయ్‌ అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement