డీఐజీ కోయ ప్రవీణ్ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్‌ | Perni Nani Reaction To Dig Koya Praveen Comments | Sakshi
Sakshi News home page

డీఐజీ కోయ ప్రవీణ్ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్‌

Aug 7 2025 3:43 PM | Updated on Aug 7 2025 5:24 PM

Perni Nani Reaction To Dig Koya Praveen Comments

సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్‌ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో జరుగుతున్న హింసపై కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ స్పందించిన తీరును మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రంగా ఖండించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న పోలీస్ అధికారి కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్  'వైఎస్సార్‌సీపీ వారు పత్తి యాపారం చేస్తే ఇట్లాగే ఉంటుంది' అంటూ వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కడప జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తాము నిర్వర్తించాల్సిన బాధ్యతను గాలికి వదిలి, పత్తియాపారం చేయడం వల్లే వరుసగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా నామినేషన్ ఘట్టం నుంచి ప్రచారం వరకు హింస, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని, నామినేషన్ నాడు ఎవరైతే దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడ్డారో వారే ప్రతి రోజూ తమ అరాచకాన్ని కొనసాగిస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.

ముందు వారిని నియంత్రించాల్సిన అధికారులు పత్తి యాపారం చేస్తున్నారా అని నిలదీశారు. 'మేం ఉన్నాం కాబట్టే తలలు తెగలేదు' అని డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పిన దానిని బట్టి చూస్తే, టీడీపీ వారు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముల తలలు తెగేవేనని, ఆయన ఉండబట్టే అది జరగలేదని అర్థమవుతోంది.

	టీడీపీ రౌడీల దాడి పై కర్నూల్ DIG వ్యాఖ్యలు ఏకిపారేసిన పేర్ని నాని

ఇటువంటి సమర్థులైన, నిజాయితీపరులైన అధికారికి ప్రెసిడెన్షియల్ పోలీస్ మెరిటోరియల్ అవార్డు, లేదా గ్యాలెంటీ అవార్డులు ఇవ్వాలని తాము రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. అంతే కాకుండా ఇదే అధికారి గాయపడిన వైఎస్సార్‌సీపీ నాయకుల గురించి మాట్లాడుతూ వారి శరీరంలో గాయాలు కనిపించడం లేదు కానీ, వారు ధరించిన దుస్తులపై మాత్రం రక్తపు మరకలు కనిపిస్తున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేయడం మరో విడ్డూరమని అన్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి కొమ్ముకాసే కొందరు అధికారులకు తాత్కాలికంగా రాజకీయ శుక్లాలు వస్తాయని, ఆ పార్టీ అధికారానికి దూరం కాగానే వారికి ఆ శుక్లాలు తొలగిపోయి వాస్తవాలు కనిపిస్తాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement